టీటీడీ దర్శనం : గోవిందా గోవిందా!

tirumala-tirupati-temple-darshanగతంలో ఎన్నడూ లేని విధంగా టీటీడీ సదుపాయాలపై భక్తులు ఆగ్రహాంతో ఊగిపోతున్నారు. కరోనా నిబంధనలు దాదాపుగా పూర్తిగా సడలిపోవడంతో, తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య గత వైభవాన్ని గుర్తు చేస్తోంది. అయితే పెరిగిన భక్తుల సంఖ్యకు అనుగుణంగా ఏర్పాట్లు చేయడంలో టీటీడీ పూర్తిగా విఫలమైందనేది భక్తుల ఆవేదన.

గత నెల రోజులుగా తిరుమల స్వామి వారి దర్శనానికి వెళ్లి వచ్చిన వారి ఆవేదన వర్ణనాతీతం. పద్దతిగా లేని క్యూ లైన్లు, అన్న ప్రసాదంలో నాణ్యత కొరవవ్వడం, సైజు తగ్గిపోయిన స్వామి వారి లడ్డు ప్రసాదం, ఓ పక్కన రద్దీ పెరిగే విధంగా భక్తులను ఉంచి, తోసుకోకుండా వెళ్లమంటూ పక్కన ప్రవచనాలు, సూక్తులు వినిపించడం… ఇలా ఒకటేమిటి, ప్రతి విభాగంలో టీటీడీపై భక్తులు మండిపడుతున్నారు.

ADVERTISEMENT

దీనికి అధికారులు కూడా తమ వంతు కారణాలను చెప్పుకుంటున్నారు. కరోనా సమయంలో 20 నుండి 30 వేల మంది మాత్రమే వచ్చే భక్తులు, ఒక్కసారిగా 70 నుండి 80 వేలకు పెరిగిపోవడంతో, సదుపాయాలు సరిగా చేయలేకపోతున్నామని సర్ది చెప్పుకుంటున్నారు. అయితే కరోనాకు ముందు ఒక లక్ష మందికి పైగా భక్తులు ఎప్పుడూ కొండ పైన ఉన్న కొలువు తీరేవారు.

గతంలో లక్ష మందికి పైనే ఉన్నప్పటికీ, సదుపాయాల విషయంలో టీటీడీ పైన ఎప్పుడూ ఇలాంటి ఆరోపణలు వ్యక్తం కాలేదు. పెరిగిన భక్తుల సంఖ్యకు అనుగుణంగా ఏర్పాట్లు చేయడంలో టీటీడీ బోర్డు విజయవంతం అయ్యింది. కానీ నేటి పరిస్థితి వేరు. భక్తులు పెరిగిపోయారని చేతులెత్తేయడం మినహా, ఏర్పాట్లలో ఎలాంటి వ్యత్యాసం లేకపోవడంతో, అంతిమంగా భక్తులలో ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది.

దర్శనానికి వెళుతూ ఒక మొబైల్ లాకర్లో పెట్టాలంటే దాదాపుగా ఒక గంట సమయం, అలాగే దర్శనం తర్వాత అదే మొబైల్ మళ్ళీ తీసుకోవాలంటే మరో గంట సమయం వెచ్చించాల్సి రావడం, భక్తుల సహనానికి పరీక్ష పెడుతోంది. ఇక దర్శనం కోసం వెళ్లే సమయంలో గానీ, దర్శనం ముగిసిన తర్వాత గోపురం నుండి బయటకు వచ్చే సమయంలో గానీ భక్తుల బాధలు వర్ణనాతీతం.

ఇదంతా కొండపైన పరిస్థితి. ఇక సర్వదర్శనం టికెట్ల కొరకు కొండ క్రింద తిరుపతిలో ఏర్పాటు చేసిన క్యూ లైన్ల పరిస్థితి గురించి చెప్పడం అసాధ్యం అనిపించే విధంగా ఏర్పాట్లు ఉన్నాయి. రోజుకు సర్వదర్శనానికి ఇచ్చే టోకెన్లు 10 నుండి 20 వేల వరకు ఉంటే, వచ్చే భక్తుల సంఖ్య అంతకు రెండింతలు రెట్టింపు ఉంటోంది.

మండుటెండల్లో పిల్లలను తీసుకొని వచ్చి భక్తులు పడుతోన్న ఇబ్బందులు అన్ని ఇన్ని కావు. వీరంతా తిరుమలకు రావడం ఇదే ప్రధమం కాదు. కానీ ఇలాంటి ఇబ్బందులు చవిచూడడం ఇదే ప్రధమం కావడం అసలు ఆగ్రహానికి కారణమవుతోంది. భక్తుల సంఖ్యకు తగ్గట్లుగా ఎలాంటి ఏర్పాట్లు చేయకుండా భక్తులను గాలికొదిలేయడం అనేది మునుపెన్నడూ జరగలేదు.

అది ఇపుడు జరుగుతుండడంతో ‘అలా వైకుంఠపుర దర్శనం’ కావాలంటే ఇలాంటి అనుభూతులు చవిచూడాలా? అని భక్తులు ఆందోళన చెందుతున్నారు, ఓ విధంగా భయపడుతున్నారు కూడా! దీనికి కారణం ఎవరో ఇబ్బందులు పడుతున్న భక్తులకు, ఆ భక్తులను చవిచూస్తోన్న ఆ దేవదేవుడికే ఎరుక! ఈ పరిస్థితులకు కారణం ఎవరైనప్పటికీ, “గోవిందా గోవిందా” అని అనుకుని వచ్చేయడం తప్ప, భక్తులు చేయగలిగింది ఏమీ లేదు.

ADVERTISEMENT
Latest Stories