సరిగ్గా రెండు సంవత్సరాల క్రితం… ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫోన్ ట్యాప్ చేసి వెలికి తీసిన వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా ఎంతటి సంచలనాన్ని సృష్టించాయో తెలిసిన విషయమే. అలాగే ఒక ముఖ్యమంత్రి ఫోన్ ను అనుమతి లేకుండా ట్యాప్ చేసినందుకు డిఫెన్స్ లో పడ్డ కేసీఆర్ ప్రభుత్వ తిప్పలు కూడా విదితమే. అయితే నాడు దాదాపుగా ఓ ఆరు నెలల పాటు మీడియాలో ప్రతి రోజు హల్చల్ చేసిన ఈ విషయం చివరికి ఏమైంది? ఆ హడావుడి ముగిసిపోయింది… ఎవరి పనుల్లో వాళ్ళు నిమగ్నమయ్యారు.
ప్రస్తుతం టాలీవుడ్ లో ప్రకంపనలు సృష్టిస్తోన్న డ్రగ్స్ కేసు కూడా చివరికి ఇదే బాటలో పయనించడం ఖాయం అన్న టాక్ ప్రజలలో వ్యక్తమవుతోంది. ‘మినిట్ టు మినిట్’ అప్ డేట్స్ ఇస్తూ హంగామా చేస్తోన్న న్యూస్ ఛానల్స్ కు కాస్త ‘మేత’ దొరికిందని భావించాలే తప్ప, ఈ కేసు అనేది ఒక రకంగా టాలీవుడ్ కు ‘వార్నింగ్’ లాంటిదని మాత్రమే చెప్పాలి. దీని వలన ఎవరి కెరీర్ ఎలాంటి ఇబ్బందుల్లో పడదు గానీ, ఇక నుండి ఇలా చేస్తే మ్యాటర్ సీరియస్ గా ఉంటుందన్న సంకేతాలను మాత్రం బలంగా పంపుతున్నారు.
రవితేజ, పూరీ జగన్నాధ్, చార్మి, తరుణ్, నవదీప్, ముమైత్ ఖాన్… ఇలా తెరపైకి వచ్చిన పేర్లన్నీ అందరికీ తెలిసినవే. వీరందరికీ నోటీసులు వెళ్ళాయి, వీళ్ళు కూడా ఆయా తేదీలలో విచారణకు హాజరై సమాధానాలు చెప్పుకుంటారు. అంతే! అంతకు మించి ఏదీ జరగదు. ఎప్పుడైతే ఈ డ్రగ్స్ కేసుకు సంబంధించి అల్లు అరవింద్, సురేష్ బాబు ప్రెస్ మీట్ నిర్వహించారో, అప్పుడే దీని వెనుక చాలా పెద్ద తలకాయలు ఉన్నాయన్న సంకేతాలు ప్రేక్షకులకు వచ్చేసాయి. చిన్న చిన్న వాళ్ళ కోసం ఈ దిగ్గజాలు బయటకు రారు కదా!
ఇప్పుడు తెరపైకి వచ్చిన వారు నిజంగా డ్రగ్స్ తీసుకున్నా, లేకున్నా… అలాగే తెరపైకి రాని పేర్లు చాలానే ఉన్నా… టాలీవుడ్ కు ఇదొక ‘వేకప్ కాల్’ క్రిందే భావించాలి. ఈ డ్రగ్స్ దందా టాలీవుడ్ లో పాతుకుపోయిందని చాలా కాలం నుండే పుకార్లు షికార్లు చేస్తున్నాయి. రవితేజ సోదరుడు భరత్ అయితే ఒకటి, రెండు సార్లు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడగా, సెలబ్రిటీ స్టేటస్ తో మేనేజ్ చేసారంటూ అప్పట్లో గుప్పుమన్న సంగతి తెలిసిందే. అయితే ఇలాంటి వాటికి పర్మినెంట్ గా శుభంకార్డు పడేయాలన్న తాపత్రయమే ప్రస్తుత హంగామా అంతా!



