“నేనున్నాను… నేను విన్నాను…“గత ఎన్నికల సమయంలో జగన్మోహన్ రెడ్డి నోట పదేపదే వినిపించిన మాటలివి… ఎవరికి ఏ కష్టం ఉన్నా వాటన్నిటినీ తన వద్ద ఉన్న మంత్రదండం తిప్పి తీర్చేస్తానన్నట్లు ఎడాపెడా హామీలు ఇచ్చేశారు. కానీ ఆ తర్వాత కధ అందరికీ తెలిసిందే.
రాష్ట్రంలో ఏవర్గం ప్రజలను కదిపినా కష్టాలు, సమస్యలు ఏకరువు పెట్టేవారే. సంక్షేమ పధకాల భారం తగ్గించుకోవడానికి రకరకాల నిబందనలతో కత్తిరించేయడంతో వాటిని అందుకొంటున్నవారు కూడా మోసపోయామనే భావనతో ఉన్నారు. అందుకే బటన్ నొక్కుడు సభలకు బలవంతంగా తీసుకువెళ్ళవలసి వస్తోంది. తీసుకెళ్ళినా కూర్చోకుండా మద్యలోనే లేచి వెళ్లిపోతున్నారు.
విషయానికి వస్తే… గత ఎన్నికల సమయంలో జగన్ టమాటా రైతులకు కూడా చాలా హామీలే ఇచ్చారు. కానీ టమాటాలు నిలువ ఉంచుకొనేందుకు కొత్తగా ఒక్క కోల్డ్ స్టోరేజ్ కట్టలేదు. టమాటా రైతులకు గిట్టుబాటు ధరలు లభించేందుకు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేయించలేదు.
మిగిలిన కూరగాయలతో పోలిస్తే టమాటాలు చాలా త్వరగా కుళ్ళిపోతాయి. కనుక కోయగానే నేరుగా మార్కెట్లకు తీసుకుపోయి అమ్ముకోవలసిందే. ఇదే టమాటా రైతుల పాలిట శాపంగా మారింది. నెల రోజుల క్రితం కేజీ టమాటా ధర రూ.200 పలికినప్పుడు రైతులు చాలా సంతోషించారు.
కానీ ఇవాళ్ళ నంద్యాల జిల్లాలో ప్యాపిలి మార్కెట్‌లో 25 కేజీల టమాటా బాక్స్ రూ. 20 నుంచి గరిష్టంగా రూ.35 మాత్రమే పలకడంతో టమాటా రైతులు కన్నీళ్ళు పెట్టుకొన్నారు. అంటే కేజీ ధర 80 పైసలు నుంచి గరిష్టంగా రూ.1.40 మాత్రమే వచ్చింది. దాంతో టమాటా రవాణా ఛార్జీలు కూడా రావడం లేదని ఆగ్రహంతో రైతులు అక్కడే రోడ్డుపక్కన పారిబోసి వెళ్ళిపోయారు. నెలరోజుల క్రితం వచ్చిన లాభం కాస్తా ఈవిదంగా తుడిచిపెట్టుకుపోయిందని రైతులు కన్నీరు పెట్టుకొంటున్నారు.
దీంతో నేనున్నాను… విన్నాను అన్నావే జగనన్నా ఎక్కడున్నావన్నా…?అని టమాటా రైతులు అడుగుతున్నారు. కానీ వారి రోదనలు వినపడనంత ఎత్తులో చార్టడ్ విమానంలో వారికి కనబడనంత దూరంలో లండన్‌కి వెళ్ళిపోయారు.
సరే… ప్రతీ సమస్యను ముఖ్యమంట్రే స్వయంగా తీర్చనక్కరలేదు. నెల్లూరు జిల్లాలోనే వ్యవసాయ, మార్కెటింగ్, ఫుడ్ ప్రాస్సెసింగ్ శాఖల మంత్రి కాకణి గోవర్ధన్ రెడ్డి గోవర్ధన్ రెడ్డి ఉన్నారు. ఆయన టమాటా రైతుల సమస్యలపై స్పందించవచ్చు. గట్టిగా తలుచుకొంటే తీర్చగలరు కూడా. కానీ పట్టించుకోలేదు.
ఆయన కాకుంటే పక్కనే చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, రోజా ఇద్దరు మంత్రులున్నారు. వారైనా స్పందించవచ్చు. కానీ వారూ తమకు సంబందం లేదన్నట్లు ఉండిపోయారు.
పశ్చిమగోదావరి జిల్లాలో పౌర సరఫరాశాఖ మంత్రి కారుమూరి నాగేశ్వర రావు ఉన్నారు. ఆయన కూడా స్పందించవచ్చు. తన శాఖ ద్వారా రైతు బజారులకు, రేషన్ షాపులకు తరలింపజేసి గిట్టుబాటు లభింపజేయవచ్చు. కానీ ఆయన పట్టించుకోలేదు.
ఇంతమంది మంత్రులలో ఏ ఒక్కరూ కూడా టమాటా రైతులు ఎదుర్కొంటున్న ఈ సమస్య పరిష్కారానికి ఎటువంటి చర్యలు చేపట్టలేకపోయారు. కనీసం వారి సమస్య గురించి ఒక్క ముక్క మాట్లాడలేదు. కానీ చంద్రబాబు నాయుడుకి ఐటి నోటీసుల గురించి మాత్రం అందరూ పోటీలు పడి మరీ తమ పాండిత్యం ప్రదర్శిస్తున్నారు. ఇందుకేనా ప్రజలు వారిని ఎన్నుకొన్నది? ఇందుకేనా వారి మంత్రి పదవులు?



