చంద్రబాబు సభకు వచ్చిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే!

thati venkateswarluపోలవరం ముంపు మండలాల పర్యటనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పశ్చిమ గోదావరి జిల్లా, కుక్కునూరులో నిర్వహించిన సభలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు ప్రత్యక్షమయ్యారు. ఖమ్మం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న వెంకటేశ్వర్లు 2014 ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీ చేసి విజయం సాధించి, తదుపరి టీఆర్ఎస్ లో చేరిన విషయం తెలిసిందే.

అశ్వారావుపేట నియోజకవర్గ పరిధిలోని వేలేరుపాడు, కుక్కునూరు మండలాలు రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో విలీనం చేసిన కారణంగా, ఈ రెండు మండలాలకు చెందిన ప్రజల సమస్యల పరిష్కారం కోసమంటూ వెంకటేశ్వర్లు తరచూ ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులను కలిసి వినతి పత్రాలు సమర్పిస్తున్నారు. ఈ క్రమంలోనే చంద్రబాబు సభకు హాజరై అందర్నీ అవాక్కు చేసిన వెంకటేశ్వర్లు… రెండు మండలాల ప్రజలు ఎదుర్కొంటున్న పలు సమస్యలను ఏపీ సీఎం దృష్టికి తీసుకువచ్చారు.

ADVERTISEMENT

ప్రజా సమస్యల పరిష్కారం కోసం తన సభకు వచ్చిన వెంకటేశ్వర్లును చంద్రబాబు సాదరంగా ఆహ్వానించారు. అలాగే, వెంకటేశ్వర్లు ప్రస్తావించిన సమస్యలను తక్షణమే పరిష్కరించాలని చంద్రబాబు అక్కడికక్కడే అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా తమ నియోజకవర్గపు సమస్యలపై దృష్టి సారించినందుకు తాటి వెంకటేశ్వర్లుపై, అలాగే వాటిని పరిష్కారం చేసే దిశగా చొరవ చూపిన చంద్రబాబుపై స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ADVERTISEMENT
Latest Stories