రాష్ట్ర విభజన జరగక ముందు వరకు ఆంధ్రప్రదేశ్ కు చెందిన రాజకీయ నాయకుల మీద, ప్రజల మీద అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన కేసీఆర్ కుటుంబ సభ్యుల స్వరంలో విభజన తర్వాత ఎంతో కొంత మార్పు వచ్చింది. నీటి వంటి కీలక అంశాలలో ఇప్పటికీ విభేదాలు తలెత్తుతున్నప్పటికీ, గతంలో మాదిరి విషపూరిత వ్యాఖ్యలకు మాత్రం దూరంగా ఉంటున్నారు. తాజాగా టీఆర్ఎస్ ఎంపీ కవిత అయితే ఏకంగా ‘జై ఆంధ్రా’ అని కూడా అనేసారు.
చికాగోలో నిర్వహించిన ‘ఆట’ వేడుకల్లో పాల్గొన్న కవిత… తెలుగు వారు పాలన పరంగా విభజన జరగాలని తాము కోరుకున్నాము తప్ప, ఎక్కడ ఉన్నా తెలుగు వారంతా ఒక్కటేనని చెప్పిన కవిత, ఇక్కడ నివసిస్తున్న వారంతా తెలుగు సినిమాలు చూస్తూ తెలుగు భాషనూ గౌరవించాలని పిలుపునిచ్చారు. ఈ వేడుకల్లో భాగస్వామ్యం అయినందుకు సంతోషంగా ఉందని అంటూ ప్రసంగం చివరన “జై తెలంగాణ,” “జై ఆంధ్రా” అనే నినాదాలతో ముగించారు కేసీఆర్ తనయురాలు.



