దేశంలో కొత్తగా అవతరించిన రాష్ట్రమైన తెలంగాణా నివాసిగా ఉంటున్నారా? అయితే 40,149 రూపాయలు మీవే. ఇందులో ఎలాంటి సందేహం లేదు. స్వయంగా రాష్ట్ర ఆర్ధిక మంత్రి ఈటెల రాజేందర్ స్పష్టం చేసారు. అయితే ఇది ఆదాయం కాదండోయ్… అప్పు..! అవును తెలంగాణా రాష్ట్రంలో ఒక్కొక్కరి తలపై 40,149 రూపాయల అప్పు ఉందని ఈటెల తెలిపారు. రాష్ట్రం మొత్తంగా చెప్పాలంటే 1,40,523 కోట్ల రూపాయల అప్పు ఉందని ఆర్ధికమంత్రి ప్రకటించారు.
2017-18లో 26,400 కోట్లను రుణంగా తీసుకోనున్నామని, మొత్తం రాష్ట్ర జీడీపీలో 18.51 శాతానికి అప్పులు పెరిగాయని అన్నారు. గత సంవత్సరం సేల్స్ టాక్స్ 42,074 కోట్లు కాగా, ఈ సంవత్సరం 37,439 కోట్లు మాత్రమే వచ్చాయని తెలిపారు. ఎక్సైజ్ ఆదాయం పెరిగిందని, 2015-16లో 5,083 కోట్ల ఆదాయం రాగా, ఈ సంవత్సరం 8,999 కోట్లు వస్తుందని అంచనా వేస్తున్నట్టు తెలిపారు. రిజిస్ట్రేషన్ల ఆదాయ లక్ష్యాన్ని తగ్గించుకున్నామని ఈటెల వెల్లడించారు.



