వినాయక చవితి నాడే భారత్‌కు తొలి విగ్నం!

Prime Minister Modi stands firm as Trump imposes 50% tariffs on Indian exports

రేపు (బుధవారం) వినాయక చవితి. దేశంలోని హిందువులు అందరూ విఘ్నాలు తొలగాలని, ఇక నుంచి అంతా శుభప్రదంగా జరగాలని కోరుకుంటూ వినాయకుడికి పూజలు చేస్తారు.

కానీ భారత్‌కు సరిగ్గా రేపటి నుంచే అతిపెద్ద విగ్నం మొదలవబోతోంది. అదే… భారత్‌ ఎగుమతులపై ట్రంప్‌ విధిస్తానన్న 50 శాతం సుంకాలు!

ADVERTISEMENT

భారత్‌ కాలమాన ప్రకారం బుధవారం ఉదయం 10 గంటల నుంచి ఈ 50 శాతం సుంకాలు అమలులోకి వస్తాయి. అమెరికా ప్రభుత్వం ఈ మేరకు భారత్‌కు లిఖిత పూర్వకంగా తెలియజేసింది.

రష్యా నుంచి భారత్‌ చమురు కొనుగోలు చేస్తుండటాన్ని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌ తప్పు పడుతున్నారు. అయితే ఆయన ఏవిదంగా తన దేశ ప్రయోజనాలు కాపాడుకోవాలని ఇటువంటి చిత్రవిచిత్రమైన నిర్ణయాలు తీసుకుంటున్నారో, అదే విధంగా ప్రధాని మోడీ కూడా భారత్‌ ప్రయోజనాలు కాపాడుకోవాలనుకోవడం తప్పు ఎలా అవుతుందో ట్రంప్‌ చెప్పలేరు.

ట్రంప్‌ ఎంత దుందుడుకుగా వ్యవహరిస్తున్నా ప్రధాని మోడీ నిర్భయంగా నిలబడటం గమనార్హం. తద్వారా భారత్‌కు ధృడమైన నాయకత్వం ఉందని, భారత్‌ ఇటువంటి ఒత్తిళ్ళకు లొంగబోదని స్పష్టం చేస్తున్నారు. అంతేగాదు… అమెరికా ఒత్తిళ్ళకు భారత్‌ తట్టుకొని నిలబడగలదని నిరూపించే చూపే ఓ గొప్ప అవకాశం ప్రధాని మోడీకి లభించిందని చెప్పవచ్చు.

భారతీయులందరూ భారతీయ ఉత్పత్తులను మాత్రమే కొనుగోలుచేయాలని ప్రధాని మోడీ పిలుపునిచ్చినంత మాత్రాన్న సరిపోదు.

ముఖ్యంగా చైనా ఉత్పత్తుల దిగుమతులు తగ్గించి దేశీయ పరిశ్రమలను ప్రోత్సహించాలి. అమెరికా సుంకాల కారణంగా చైనాకు మళ్ళీ దగ్గరవ్వాలని భారత్‌ ప్రయత్నిస్తున్నప్పుడు, ‘చైనా మాల్’పై ఆంక్షలు విధించడం ఇబ్బందికరమే.

కానీ ఇటువంటి క్లిష్ట సమయంలో దేశీయ ఉత్పత్తులను మాత్రమే కొనుగోలు చేస్తూ భారతీయ పరిశ్రమలను కాపాడుకోవాలని ప్రధాని మోడీ స్వయంగా చెపుతున్నారు కనుక ‘చైనా మాల్’ని కట్టడి చేయడానికి ఇదే తగిన సమయం.

ఈ సమయంలో భారతీయ పరిశ్రమలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అండగా నిలబడటం చాలా చాలా అవసరం. ముఖ్యంగా ట్రంప్‌ సుంకాలతో తీవ్రంగా నష్టపోతున్న పరిశ్రమలు, సంస్థలకి ఊరట కలిగించే నిర్ణయాలు తీసుకోవాలి. సామాన్య, మద్య తరగతి ప్రజలపై ఈ ప్రభావం పడకుండా చేసేందుకు గట్టి ప్రయత్నాలు చేయాలి.

కేంద్ర ప్రభుత్వం ఇటువంటి చర్యలు తీసుకొని పారిశ్రామికవేత్తలకు, ప్రజలకు ఈ నమ్మకం కలిగించగలిగితే, ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు చెప్పినట్లు ట్రంప్‌ సృష్టించిన ఈ సమస్యలు, సవాళ్ళే భారత్‌కు ఎదుగుదలకు మరో గొప్ప అవకాశంగా మారుతుంది.

మరి వినాయక చవితి నాడే ఏర్పడబోతున్న ఈ తొలి విగ్నాన్ని భారత్‌ అధిగమించగలదో లేదో రాబోయే రోజుల్లో చూద్దాం!

ADVERTISEMENT
Latest Stories