తెలంగాణాలో గెలిచిన 15 మంది ఎమ్మెల్యేలలో ఇప్పటికే 10 మంది ఎమ్మెల్యేలు అధికార పార్టీ జెండా పట్టుకోగా, మిగిలిన అయిదు మందిలో ఎవరెప్పుడు వెళ్లిపోతారో అంటూ కధనాలు ప్రసారమవుతున్నాయి. ఏకంగా రేవంత్ రెడ్డి కూడా కాంగ్రెస్ గూటికి చేరవచ్చనే వార్తలపై ఇటీవల ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రేవంత్ రెడ్డి దీనిపై ఓ స్పష్టమైన ప్రకటన చేసారు. 2019 ఎన్నికలలో నేను తెలుగుదేశం పార్టీ తరపునే పోటీ చేస్తాను… కావాలంటే రాసి పెట్టుకోండి… అంటూ మీడియా ప్రతినిధికే సవాల్ విసిరి పుకార్లకు తెరదించారు.
అయితే, రేవంత్ విషయంపై పార్టీ అధినేత చంద్రబాబుకు స్పష్టత ఉన్నప్పటికీ, మిగిలిన వారిపై సందేహాలు నెలకొన్న నడుమ, తాజాగా మరో ఇద్దరు ఎమ్మెల్యేలు షాక్ ఇచ్చేందుకు సిద్ధమయ్యారని తెలుస్తోంది. గతంలో రాష్ట్రానికి హోంమంత్రిగా పనిచేసిన మాధవరెడ్డి వర్ధంతి సందర్భంగా పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి హాజరు కావాలన్న అధినేత నారా చంద్రబాబునాయుడు ఆదేశాలను జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ తో పాటు మరో ఎమ్మెల్యే అరికెపూడి గాంధీలు ధిక్కరించారు.
దీంతో వీరిద్దరూ కూడా పార్టీని వీడడం ఖయమంటూ రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇటీవల కాలంలో గోపీనాద్ పై ఇలాంటి వార్తలు వచ్చినప్పటికీ… అవన్నీ ఒట్టి పుకార్లే అంటూ ఖండించారు. అయితే స్వయంగా పార్టీ అధినేత ఆదేశాలనే ధిక్కరించడంతో… గత కొన్ని రోజులుగా టీఆర్ఎస్ తో జరిపిన చర్చలు సఫలమయ్యాయని, ఈ ఇద్దరూ కూడా కారు ఎక్కడం ఖాయమని సమాచారం.



