ఉండవల్లి అప్పుడే మద్దతు ప్రకటించేశాడుగా!

Undavalli Arun Kumar gives his supoort for KCR New Partyతెలంగాణ సిఎం కేసీఆర్‌ బిఆర్ఎస్‌ పార్టీ ఏర్పాటు చేసి ఇంకా 24 గంటలు కాకముందే అప్పుడే దానిపై ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. “ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ శూన్యత లేదు కనుక, వైసీపీ చాలా బలంగా ఉన్నందున రాష్ట్రంలో బిఆర్ఎస్‌కు ప్రజాధారణ లభించదని” వైసీపీ నేతలు చెపుతున్నారు.

కానీ ఏపీలో టిఆర్ఎస్‌ పార్టీని విస్తరించాలని తమకు చాలా విజ్ఞప్తులు వస్తున్నాయని, కనుక ఏపీలో తమకు ప్రజాధారణ లభిస్తుందని టిఆర్ఎస్‌ నేతలు చెప్పుకొంటున్నారు. వారి మాటలను దృవీకరిస్తున్నట్లుగా నిన్న విజయవాడ, గుంటూరు, విశాఖతో సహా పలు నగరాలలో కేసీఆర్‌కు అభినందనలు తెలుపుతూ, ఆంధ్రప్రదేశ్‌లోకి బిఆర్ఎస్‌కు స్వాగతం అంటూ ఫ్లెక్సీ బ్యానర్లు వెలిశాయి. కొంతమంది కేకులు కట్ చేసి, టపాసులు పేల్చి స్వీట్లు పంచుకొన్నారు.

ADVERTISEMENT

బహుశః వారు రాజకీయ నిరుద్యోగులు అయ్యుండవచ్చు. అటువంటి మరో రాజకీయ నిరుద్యోగి ఉండవల్లి అరుణ్‌కుమార్‌ కూడా బిఆర్ఎస్‌కు మద్దతు తెలిపారు.

నిన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ, “బిజెపిని వ్యతిరేకించే ఏ పార్టీకైనా నేను మద్దతు ఇస్తాను. కేసీఆర్‌కి ఆ దమ్ము, సరుకు ఉంది కనుక నా ఓటు బిఆర్ఎస్‌కే. ఆయన మాత్రమే ధైర్యంగా మతతత్వ బిజెపిని, ప్రధాని నరేంద్రమోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాలను ఎదిరించి పోరాడగలరని నమ్ముతున్నాను,” అని అన్నారు.

కొన్ని రోజుల క్రితమే కేసీఆర్‌ ఆహ్వానం మేరకు ఉండవల్లి అరుణ్‌కుమార్‌ హైదరాబాద్‌ వెళ్ళి ప్రగతి భవన్‌లో సిఎం కేసీఆర్‌తో సుదీర్గంగా సమావేశమయ్యారు. వారు ఈ బిఆర్ఎస్‌ పార్టీ ఏర్పాటులో న్యాయపరమైన అంశాల గురించి చర్చించారని వార్తలు వచ్చినప్పటికీ, ఏపీలో బిఆర్ఎస్‌ పార్టీని ఏవిదంగా విస్తరించాలనే దానిపైనే ప్రధానంగా చర్చించినట్లు ఊహాగానాలు వినిపించాయి. అలాగే ఏపీలో బిఆర్ఎస్‌ రాజకీయ వ్యవహారాల ఇన్‌చార్జిగా ఉండవల్లి అరుణ్‌కుమార్‌కు కేసీఆర్‌ బాధ్యతలు అప్పగించినట్లు ఊహాగానాలు వినిపించాయి. ఇప్పుడు ఉండవల్లి అరుణ్‌కుమార్‌ మాట్లాడిన ఈమాటలు వినట్లయితే ఆ ఊహాగానాలు నిజమే అని ఆయన దృవీకరిస్తున్నట్లుంది.

అయితే ఆనాడు కేసీఆర్‌ రాష్ట్ర విభజన కోసం పోరాడుతుంటే ఆయనకు వ్యతిరేకిస్తూ గట్టిగా పోరాడిన ఉండవల్లి అరుణ్‌కుమార్‌ ఇప్పుడు ఆయనతోనే చేతులు కలిపేందుకు సిద్దపడుతుండటం చాలా విడ్డూరంగా ఉంది. ఆనాడు రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి రాజకీయ సన్యాసం స్వీకరించిన ఉండవల్లి అరుణ్‌కుమార్‌, రాష్ట్ర విభజనకు కారకుడైన ‘కేసీఆర్‌కే నా ఓటు!’ అని ఇప్పుడు చెపుతుండటం ఇంకా విడ్డూరంగా ఉంది.

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం నేడు ఈ దుస్థితిలో ఉండటానికే కేసీఆరే కారణమని తెలిసి ఉన్నప్పటికీ, “కేసీఆర్‌ బిజెపిని వ్యతిరేకిస్తున్నందున ఆయనకు మద్దతు ఇస్తున్నానని” ఉండవల్లి కవరింగ్ ఇచ్చుకోవడం హాస్యాస్పదంగా ఉంది. గత ఎనిమిదన్నరేళ్ళుగా రాజకీయ నిరుద్యోగిగా ఉన్న ఉండవల్లి కేసీఆర్‌తో కలిసి మళ్ళీ జాతీయ రాజకీయాలలోకి వెళ్ళి చక్రం తిప్పాలనుకొంటున్నారేమో?రాష్ట్ర ప్రయోజనాల కంటే సొంత ప్రయోజనాలే ముఖ్యమని ఉండవల్లి అరుణ్‌కుమార్‌ భావిస్తున్నారా?

ADVERTISEMENT
Latest Stories