ఉండవల్లి అరుణ్ కుమార్ తన గీత బోధనలతో ఆరిపోయిన మంటలో ఆజ్యం పోసి మళ్ళీ ప్రాంతీయ నిప్పు పుట్టించాలనుకుంటున్నారా.? రెండు రాష్ట్రాల మధ్య ముగిసిన ఒక వివాదాన్ని మళ్ళీ తెరమీదకు తెచ్చి ఇరు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య రాజకీయ యుద్దానికి తెరలేపాలని భావిస్తున్నారా.?
అవును తాజాగా ఉండవల్లి అరుణ్ కుమార్ గారి రాజకీయ ప్రవచనాలు, పవన్ కి ఇచ్చిన సలహాలు, సూచనలు చూస్తే ఆయన ఉద్దేశం ఇదే అనేది స్ఫష్టంగా తెలుస్తుంది. అయితే వై.? అనే ప్రశ్న ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో చర్చనీయాంశంగా మారింది.
ఉండవల్లి మాజీ కాంగ్రెస్ ఎంపీగా, వైస్ కుటుంబానికి వీర విధేయుడుగా ఇప్పటికే తెలుగు రాష్ట్ర రాజకీయాలకు సుపరిచితుడే. కానీ కొంతమంది దృష్టిలో మాత్రం ఉండవల్లి ఇప్పటికి ఎప్పటికి వైసీపీ తెరచాటు మద్దతుదారుడిగా, సానుభూతిపరుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు.
అయితే ఆ గుర్తింపుకి తగ్గట్టే ఉండవల్లి టీడీపీ ని ఇబ్బందిపెట్టేందుకు, వైసీపీ కి ప్రత్యర్థిగా రాజకీయం చేస్తున్న వారిని ఇరుకున పెట్టేందుకు తన రాజకీయ అనుభవాన్ని ఒక అస్త్రంలా వినియోగిస్తారు, వినియోగిస్తున్నారు కూడా.
తాజా అంశం విషయానికొస్తే పవన్ కళ్యాణ్ చేసిన ‘కోనసీమ కు తెలంగాణ దిష్టి’ వ్యాఖ్యలపై తెలంగాణ లో ఒక వర్గం నాయకులు పవన్ ను పొలిటికల్ గా, వృత్తి పరంగా టార్గెట్ చేస్తూ ప్రకటనలు ఇచ్చారు. అయితే తెలంగాణ నుంచి వచ్చిన రాజకీయ విమర్శలకు, పవన్ సినిమాల బ్యాన్ బెదిరింపులకు ఇటు ఏపీ ప్రభుత్వం నుంచి కానీ జనసేన పార్టీ నుంచి కానీ ఎటువంటి కౌంటర్ రాలేదు.
అయితే పవన్ వ్యాఖ్యలను వక్రీకరిస్తున్నారు అనే వివరణ తప్ప జనసేన నుంచి ఎటువంటి అఫిషియల్ ప్రతిదాడి జరగలేదు. ఇక నిన్న తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోటంరెడ్డి ఏపీ సీఎంని కలిసిన సందర్భంలో అవి చిన్న చిన్న విషయాలు, అలా జరుగుతుంటాయి, అలానే వదిలేయాలి అంటూ వివాదానికి ఒక ముగింపు పలికారు.
ఇలా కోనసీమలో మొదలైన వివాదం రెండు రోజుల తెలంగాణ నాయకుల హడావుడి తరువాత సద్దుమణిగిపోయింది. ఇటువంటి సందర్భంలో మీడియా ముందుకొచ్చిన ఉండవల్లి పవన్ చేసిన ఈ వ్యాఖ్యలు సరికాదని, ఒక ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి ఈ రకంగా రెండు రాష్ట్రాల మధ్య విద్వేషాలు రెచ్చకొట్టేలా బాధ్యరాహిత్యంగా మాట్లాడటం సబబు కాదంటూ పవన్ కు హిత బోధ చేసారు.
అయితే ఉండవల్లి గారి ప్రకటనలతో మాడిపోయిన గాయం తిరిగి రాచుకున్నట్టయింది. అయితే అసలు ఇప్పుడు ఈ వివాదం పూర్తిగా సద్దుమణిగిన తరువాత ఉండవల్లి మీడియాలో ఇలా తెలంగాణ ప్రజలను, అక్కడి నాయకులను తిరిగి రెచ్చకొట్టేలా ఎందుకు మాట్లాడారు.? ఆ మాటల వెనుక ఎవరున్నారు.? అనే సందేహాలు మొదలయాయ్యి.
ఎవరి ప్రలోభం కోసం, ఎవరి మెప్పు కోసం, ఎవరి కళ్ళలో ఆనందం కోసం ఉండవల్లి ఈ గీతాభోధనలు చేస్తున్నారు.? అయితే ఆ బోధనలు యుద్ధం కోసమా.? శాంతి కోసమా.?







