యూపీ – బిజెపి ‘హస్త’గతం!

UP govt - BJPపెద్ద నోట్ల రద్దు అనంతరం దేశంలో బీజేపీకి ప్రతికూల పవనాలు వీస్తున్నాయన్న ప్రచారం అవాస్తవమని ఉత్తరప్రదేశ్ ఓటర్లు తేల్చిచెప్పినట్టు యూపీ అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ వివరిస్తున్నాయి. ఉత్తరప్రదేశ్ లో బీజేపీ సత్తా చాటనుందని, ప్రత్యర్థి సమాజ్ వాదీ-కాంగ్రెస్ పార్టీల కూటమిని ఓడిస్తుందని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. యూపీ ఎన్నికల్లో బీజేపీ 170 నుంచి 185 స్థానాల్లో విజయం సాధిస్తుందని, ఎన్డీటీవీ, న్యూస్ ఎక్స్, టైమ్స్ నౌ సంస్థలు చెబుతున్నాయి.

సమాజ్ వాదీ-కాంగ్రెస్ పార్టీల కూటమి 120 నుంచి 130 స్థానాల్లో విజయం సాధిస్తుందని, బహుజన్ సమాజ్ పార్టీ 90 నుంచి 100 స్థానాల్లో విజయం సాధించవచ్చని ప్రకటించాయి. దీంతో దేశంలోని అతి పెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ లో విజయం సాధించడం ద్వారా పార్లమెంటులో పూర్తి స్థాయి నిర్ణయాధికారాన్ని బీజేపీ చేజిక్కించుకోనుందని ఎగ్జిట్ పోల్స్ స్పష్టం చేశాయి. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలతో అఖిలేష్-రాహుల్ ఒక్కటైనా మోడీ ముందు బలాదూరయ్యారని తేలిందని ఎగ్జిట్ పోల్స్ నిర్వహించిన సంస్థలు చెబుతున్నాయి.

ADVERTISEMENT

పంజాబ్ – కాంగ్రెస్ కు అభయం!
పంజాబ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సత్తా చాటనుందని, కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి పంజాబ్ లో పాగా వేయనుందని ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు చెబుతున్నాయి. పంజాబ్ లో మొత్తం 117 స్థానాలకు జరిగిన శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 71 స్థానాలు వస్తాయని ఇండియా టుడే అంచనా వేసింది. అధికారంలో ఉన్న అకాలీ దల్-బీజేపీ కూటమి కేవలం 7 స్థానాలకే పరిమితమవుతుందని నివేదికలు స్పష్టం చేశాయి. పంజాబ్ లో 51 స్థానాల్లో విజయం సాధించి రెండో అతిపెద్ద పార్టీగా ప్రతిపక్ష పాత్రను ఆమ్ ఆద్మీ పార్టీ పోషించనుందని ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు చెప్తున్నాయి. మొత్తానికి కాంగ్రెస్ పార్టీ తన ఉనికిని చాటుకోనుందని తెలుస్తోంది.

గోవా – బిజెపికి షాక్… కాంగ్రెస్ కిక్..!
గోవాలో అధికార బీజేపీకి షాక్ తగలనుందని ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు తెలిపాయి. ఇంతవరకు గోవాలో అధికారంలో ఉన్న బీజేపీకి షాకిస్తూ ఓటర్లు తీర్పు చెప్పనున్నారని సర్వే ఫలితాలు తెలిపాయి. బీజేపీకి కేవలం 12 నుంచి 18 స్థానాలు, కాంగ్రెస్ పార్టీకి 15 నుంచి 21 స్థానాలు, ఆమ్ ఆద్మీ పార్టీకి 7 నుంచి 9 స్థానాల్లో విజయం లభించనుందని తెలిపాయి. దీంతో గోవాలో స్వల్ప ఆధిక్యంతో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టే అవకాశం ఉందని ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. గోవాలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు స్వల్ప తేడాతో స్థానాలు గెలుచుకుంటాయని ఎగ్జిట్ పోల్స్ తెలిపాయి.

మణిపూర్ – కాంగ్రెస్ అవుట్… బిజెపి ఇన్..!
ఈశాన్య భారతదేశంలో బీజేపీ తొలిసారి పూర్తి స్థాయిలో సత్తా చాటింది. మణిపూర్ ఎన్నికల్లో బీజేపీ పూర్తి స్థాయి విజయం సాధించనుందని ఇండియా టీవీ, సీవోటర్ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెల్లడించాయి. 60 శాసనసభ స్థానాలు గల మణిపూర్ లో బీజేపీ 31 స్థానాల్లో విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుందని తెలుస్తోంది. 23స్థానాల్లో విజయం సాధించడం ద్వారా కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షానికి పరిమితమవుతుందని ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు తెలిపాయి.

ఉత్తరాఖండ్ – బిజెపి వైపే చూపు!
70 స్థానాలకు గానూ ఉత్తరాఖండ్ లో జరిగిన ఎన్నికల్లో బీజేపీదే విజయమని ఎగ్జిట్ పోల్ ఫలితాలు చెబుతున్నాయి. ఉదయ్ చాణక్య, ఇండియా టుడే, న్యూస్ ఎక్స్ సంస్థలు బీజేపీ భారీ ఆధిక్యంతో గెలవనుందని 32 నుంచి 53 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉందని చెబుతున్నాయి. అదే సమయంలో అధికార కాంగ్రెస్ పార్టీకి 15 నుంచి 32 స్థానాల మధ్య దక్కించుకుంటాయని, ఇతరులు 2 నుంచి 6 స్థానాల మధ్య గెలుచుకుంటాయని చెబుతున్నాయి. దీంతో ఉత్తరాఖండ్ లో బీజేపీ అధికారం చేపట్టే అవకాశం ఉన్నట్టు ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి.

ADVERTISEMENT
Latest Stories