మొన్న శ్రీలంక, నిన్న బంగ్లాదేశ్, నేడు నేపాల్ ఇలా భారత సరిహద్దులలో ఉండే పొరుగు దేశాలలో ప్రభుత్వాల మీద అక్కడి నాయకుల మీద ప్రజా పోరాటాలు రచ్చకెక్కుతున్నాయి.
తీవ్ర స్థాయిలో జరుగుతున్న ఈ ప్రజా పోరాటాలతో అక్కడి దేశాధిపతులు రహస్యంగా దేశ సరిద్దులు దాటి పొరుగు దేశాలలో తలదాచుకునే పరిస్థితులకు వస్తున్నారు. దీనంతటి వెనుక దాగున్న కారణాల పై నేడు సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది.
అయితే ఈ మూడు దేశాలలో తలెత్తిన ప్రజా పోరాటాల గురించి క్లుప్తంగా…
ముందుగా శ్రీలంక విషయానికొస్తే అక్కడ ఆహార ధరలు ఆకాశాన్ని తాకడం, ఇంధన సంక్షోభం, డాలర్ కొరత రావడంతో దేశం ఆర్థిక సంక్షోభంలోకి వెళ్ళిపోయింది. అయితే పెరిగిన ధరలను నియంత్రించడంలో విఫలమైన శ్రీలంక ప్రభుత్వం ప్రజలలో పెరిగిపోయిన వ్యతిరేకతను కూడా అదుపు చేయడంలో చేతులెత్తేసింది.
అవినీతి, కుటుంబ రాజకీయాలంటూ రాజపక్సే పాలన్ పై శ్రీలంక ప్రజలలో పెరిగిన వ్యతిరేకత నిరశన గా మారి శ్రీలంక ప్రభుత్వాధిపతుల ఆస్తుల ధ్వంశం వరకు వెళ్ళింది, చివరికి ఆ ప్రజా నిరసనలే హింసగా రూపాంతరం చెంది శ్రీలంక చరిత్రలో ఒక చీకటి అధ్యాయాన్ని రచించింది.
ఇక ఆ తరువాత ఈ సంక్షోభంలోకి బంగ్లా ప్రభుత్వం అడుగు పెట్టింది. బంగ్లా విషయానికొస్తే.., ద్రవ్యోల్భవం, పెరిగిపోయిన నిరుద్యోగ సమస్య, దానితో దేశంలో పెరిగిన పేదరికం కలిపి బంగ్లా ప్రజలు పోరాటం బాట పట్టారు.
బంగ్లాదేశ్ లోని షేక్ హసీనా ప్రభుత్వం పై అవినీతి ఆరోపణలు ఎక్కువడంతో పాటుగా మీడియా పై నియంత్రణ , ప్రతిపక్ష పార్టీల అణిచివేత తో హసీనా నియంతృత్వ ధోరణి పై బంగ్లా వ్యాప్తంగా నిరశన కార్యక్రమాలు ఉగ్రరూపం దాల్చాయి. దీనితో హసీనా దొంగ చాటుగా బంగ్లా దేశ సరిహద్దులు దాటాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి.
ఇక చివరిగా తాజాగా ఈ ప్రజా పోరాటాలతో భగ్గుమన్న నేపాల్ వివాదానికొస్తే, ఇక్కడి ప్రభుత్వం తీసుకుంటున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలు, వారి స్వేచ్ఛ పై ప్రభుత్వం విధిస్తున్న నియంత్రణ కలిపి నేపాల్ పార్లమెంట్ తగలబడే వరకు వెళ్ళింది, అలాగే అక్కడి మంత్రుల పై నిరసన కారులు నడి రోడ్ల మీద దాడుల చేసే వరకు పరిస్థితి దిగజారింది.
ఈ మూడు దేశాల విషయంలోనూ కామన్ గా కనిపించే అంశాలు ముఖ్యంగా దేశంలో ఆర్థిక సంక్షోభం పెరిగిపోవడం, ప్రజా స్వామ్య హక్కుల ఉల్లంఘన జరగడం, ప్రభుత్వాధిపతుల అవినీతి హద్దులు దాటటం, ప్రజా హక్కుల పై అధికారం అనే నియంతృత్వం పెరిగిపోవడం,
దేశంలో నిరుద్యోగం, పేదరికం నాట్యం చేయడం, నిత్యావసర ధరలను అదుపులోకి తేలేకపోవడం, ప్రజల సమస్య పరిష్కారం పక్కన పెట్టి వారి విలాస జీవితాలకు ప్రాధాన్యం ఇవ్వడం తో ఆయా దేశాల ప్రజలలో మొదలైన తిరుగుబాటు దేశాధిపతులను సైతం దేశం విడిచి పారిపోయేలా చేస్తున్నాయి.
ఇప్పటికైనా శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్ ప్రభుత్వాల పాలన ఇతర దేశాల నియంతృత్వ ధోరణికి ఒక చెంపపెట్టు వంటిదని గ్రహించాలి. ప్రజలు ఎదురు తిరిగితే ఎంతటి కొమ్ములు తిరిగిన నేతలైన, అగ్రరాజ్య అధిపతులైన ప్రజా పోరాటాలకు తలవంచక తప్పదు, ఆ నిరశనకారుల ఉగ్ర రూపానికి తల దాచుకోక తప్పదు.





