శనివారం ఇస్లామాబాద్‌లో అమెరికా-ఇరాన్ ప్రతినిధుల మద్య సాగిన శాంతి చర్చలు విఫలమయ్యాయి. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ చర్చలు విఫలమయ్యాయని ప్రకటించి అమెరికా తిరుగు ప్రయాణమయ్యారు.
పాక్ మధ్యవర్తిత్వంతో ఈ శాంతి చర్చలు సఫలమవుతాయని ఎవరూ ఆశించలేదు. కానీ పాక్ ప్రయత్నం వలన రెండు వారాలు యుద్ధం ఆగినందుకు అందరూ సంతోషించారు. ఊహించినట్లే చర్చలు విఫలమయ్యాయి. కనుక అమెరికా-ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ మీద దాడులు చేయడం ఖాయం. మళ్ళీ ఎప్పటి నుంచి అనేదే ప్రశ్న.
అయితే ఈసారి ట్రంప్ వ్యూహం మార్చి ఇరాన్ చమురు నౌకలను దిగ్బంధం చేసి, ఆ దేశ ఆర్ధిక వ్యవస్థని కట్టడి చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఒకవేళ అలా చేస్తే ఇరాన్ నుంచి చమురు, గ్యాస్ కొనుగోలు చేస్తున్న భారత్, చైనాలకు తీవ్ర ఒత్తిడికి గురవుతాయి.
ఇరాన్‌ని ఏదో విధంగా లొంగదీసుకొని ప్రపంచ దేశాల ఎదుట కాలర్ ఎగరేయాలని ట్రంప్ ఆరాటపడుతున్నారు. ఇజ్రాయెల్‌కు బద్ధ శత్రువైన ఇరాన్ మీద ఇంత స్వేచ్చగా బాంబులు వర్షం కురిపించి నాశనం చేసే అవకాశం మళ్ళీ రాదు కనుక ఇజ్రాయెల్ యుద్ధమే కోరుకుంటోంది. ఆ రెండు దేశాలు తమ సార్వభౌమత్వానికి సవాలు విసురుతూ, తమ దేశాన్ని నాశనం చేసేస్తుంటే మనుగడ, ఆత్మగౌరవం కోసం ఇరాన్ పోరాడక తప్పడం లేదు. యుద్ధం చేయడానికి ఎవరి కారణాలు వారికున్నాయి కానీ యుద్ధం విరమించడానికి ఎవరూ సిద్ధంగా లేరు.
ఈ విషయం భారత్ ముందే పసిగట్టింది కనుకనే మధ్యవర్తిత్వానికి ప్రయత్నించలేదు. కానీ పాక్ తనపై ఉన్న ఉగ్రవాద ముద్ర చెరిపేసుకొని శాంతిదూతగా అవతరించాలని ఆరాటపడి నవ్వులపాలైంది.
కానీ 4-5 వారాలలో ముగిసిపోతుందనుకున్న ఈ యుద్ధం రెండో నెలలోకి ప్రవేశించింది. కనుక ఈ యుద్ధం ఇలాగే ఇంకా ఎక్కువ కాలం కొనసాగితే భారత్‌కు కూడా చాలా నష్టమే. కానీ ట్రంప్ వంటి మాట, బుద్ది నిలకడలేని అహంబావిని ఒప్పించడం చాలా చాలా కష్టమే. మరి పిల్లి మేడలో గంటెవరు కడతారు? ఎప్పుడు?




