భారత్ పై అమెరికా విధించిన 50 % టారీఫ్స్ తో భారత స్టాక్ మార్కెట్లు తీవ్ర నష్టాలను చవి చూస్తున్నాయి. రష్యా నుంచి పెట్రోల్ ను కొనుగోలు చేసే అంశంలో అమెరికా ఆదేశాలను భారత్ భేఖాతరు చేయడంతో ఆగ్రహించిన ట్రంప్ భారత ఎగుమతుల పై మొదట విధించిన 25 % సుంకాలను మరో 25 % పెంచుతూ మొత్తంగా భారత ఎగుమతుల పై 50 % టారీఫ్లను విధించారు.
అయితే ఈ టారీఫ్స్ ఫలితంగా అటు ఇండియా – అమెరికా మధ్య ఉన్న వాణిజ్య బంధాలతో పాటుగా ఇరు దేశాల మధ్య ఇప్పటి వరకు కొనసాగుతున్న స్నేహ సంబంధాలు కూడా దెబ్బ తినే అవకాశం ఉంది. అలాగే ఇటు ఈ టారీఫ్ల భారం భారత ఆర్థిక వ్యవస్థ కు కూడా దెబ్బ తీసే ప్రమాదం ఉందంటున్నారు ఆర్థిక నిపుణులు.
ఇలా భారత్ పై అమెరికా విధించిన ఎగుమతుల సుంకాలు బయట రచ్చ చేస్తుంటే, ఇక ట్రంప్ ఇండియా మీద వేస్తున్న అదనపు సుంకాలకు ప్రతిగా అమెరికా వస్తువుల పై కూడా కేంద్ర ప్రభుత్వం అదనపు సుంకాలు విధించాలంటూ జాతీయ స్థాయి ప్రతిపక్షాలు బీజేపీ టార్గెట్ గా విమర్శలు ఎక్కుపెడుతున్నాయి.
చైనా పై ట్రంప్ విధించిన సుంకాల కు ప్రతిగా ఆ దేశ అధినేత జిన్ పింగ్ కూడా అమెరికా వస్తువుల పై అదే స్థాయిలో టారిఫ్ లు విధించడంతో ట్రంప్ వెనకడుగు వేసి చైనా తో వాణిజ్య చర్చలకు సిద్ధమయ్యారు. దాని ఫలితంగా చైనా వస్తువుల పై తానూ విధించిన టారిఫ్ లను తానే తిరిగి వెనక్కి తీసుకునేలా అమెరికా అధ్యక్షుడికి చైనా గట్టి బదులు చెప్పగలిగింది.
భారత్ కూడా ఇదే మాదిరి ట్రంప్ టారీఫ్ల పై దూకుడుగా స్పందించాలని అప్పుడే అమెరికా వెనక్కి వచ్చి భారత్ పై విధించిన అదనపు సుంకాలను తగ్గిస్తుందంటూ ఆప్ పార్టీ అధినేత కేజ్రీవాల్ బీజేపీ కి సూచనలు చేస్తున్నారు.
తనకు ఎదురు తిరిగిన దేశాల ముందు ట్రంప్ తల వంచారు, కానీ ప్రధాని మోడీ మాత్రం ట్రంప్ కవ్వింపు చర్యల పై, దూకుడు నిర్ణయాల పై ఎటువంటి స్పందన లేకుండా మౌనంగా ఉండిపోతున్నారు ఎందుకు అంటూ కేరాఫ్ ఆఫ్ మోడీ గా ఆప్ కేజ్రీవాల్ అనేక ప్రశ్నలను లేవనెత్తారు.
అమెరికా మన వస్తువుల మీద 50 % టారీఫ్స్ వేస్తే, మనం అమెరికా వస్తువుల మీద 100 % టారీఫ్స్ వెయ్యాలి, మనది బలహీన దేశమా.? మనకు 140 కోట్ల జనాభా, బలమైన మార్కెట్ ఉంది, అయినా భారత్ ను ట్రంప్ డెడ్ ఎకానమీ అంటూ కించపరుస్తున్నారు. ఇటువంటి వాటికి కౌంటర్ ఇవ్వడానికి కూడా కేంద్ర ప్రభుత్వంలో ఉన్న బీజేపీ ఎందుకు వెనక్కి తగ్గి ఆలోచిస్తుంది.? అంటూ ఆప్ రచ్చ మొదలయ్యింది.
ఇక కాంగ్రెస్ సంగతి చెప్పనక్కరలేదు. ఇప్పటికే ఓట్ చోరీ అంటూ ఇంట రాజకీయ రచ్చ మొదలు పెట్టిన రాహుల్, ఆపరేషన్ సింధూర్ పై కూడా ట్రంప్, మోడీ చేతుల మీదుగా నీళ్లు పోశారు అంటూ మోడీ టార్గెటెడ్ విమర్శలు చేస్తున్నారు. అలాగే ట్రంప్ టారీఫ్ల విషయంలో మోడీ మౌనమేలనోయి అంటూ రాగాలు తీస్తుంది.
దేశంలో ఏ రాజకీయ పార్టీ నాయకుడైన మోడీకి వ్యతిరేకంగా మాట్లాడితే వారి పై అక్రమ కేసులు పెట్టి వారి పార్టీ జుట్టు తమ గుప్పెట్లో పెట్టుకుని రాజకీయ అశ్వమేధ యుద్ధం చేస్తున్న మోడీ, షాలు ఇప్పుడు భారత్ పై ట్రంప్ అంతలా రెచ్చిపోతున్నా, భారత్ ఎకానమీ ని దెబ్బ తీసేలా వేగంగా చర్యలు తీసుకుంటున్నా కేంద్ర ప్రభుత్వం నుండి ఎటువంటి స్పందన రావడం లేదు.
భారత ప్రధానిగా ప్రపంచ దేశాలలో గుర్తింపు తో పాటు గౌరవం సంపాదించుకున్న మోడీ ట్రంప్ ప్రకటనల పై వ్యతిరేకంగా ఇంతవరకు ఒక భారీ ప్రకటన కూడ ఇవ్వలేకపోతున్నారు. నాడు భారత్ – పాక్ యుద్దాన్ని ఆపింది నేనే అంటూ ట్రంప్ ప్రపంచమంతా డప్పు కొట్టుకుంటున్నా, భారత్ డెడ్ ఎకానమీ అంటూ భారత ఆర్థిక ప్రతిష్ట దెబ్బతీసేలా రెచ్చకొట్టే ప్రకటనలు పాస్ చేసినా,
నేడు మన దేశ కొనుగోళ్లు – అమ్మకాల పై ట్రంప్ ఆంక్షలు పెడుతూ, అవి అమలు కాకపోతే ఫెనాలిటీ టారిఫ్ లు అంటూ బెదిరిస్తూ భారత్ వస్తువుల మీద సుంకాల మోత మోగిస్తున్నా మోడీ ఇప్పటి వరకు అమెరికా కు వ్యతిరేకంగా, ట్రంప్ కి బరువైన, బలమైన కౌంటర్ ఇవ్వలేదనే భావన అధిక శాతం భారతీయులలో కనిపిస్తుంది.
మరి ఇన్నాళ్ళుగా ఇంట గెలిచి భయటా గెలుస్తూ వస్తున్న మోడీ ఇపుడు ట్రంప్ టారీఫ్ల తో, అమెరికా ఆంక్షలతో ఇంటా, భయటా ఎలా నెగ్గుకొస్తారు.? తన నిర్ణయాలతో దేశ ప్రజలను ఎలా మెప్పిస్తారు.? కేవలం స్వదేశీ వస్తువుల కొనుగోళ్లు దేశానికి అవసరం అంటూ పిలుపునిచ్చి, వాటిని ప్రోత్సహించి భారత్ పై ట్రంప్ కొట్టిన టారిఫ్ దెబ్బ నుంచి మోడీ భయట పడగలరా.? దేశాన్ని భయటపడేయగలరా.?





