సంక్షేమ పథకాలే వైసీపీ పార్టీకి శ్రీరామ రక్షా అంటూ ఒక భ్రమలో ఉన్న వైసీపీ నాయకులకు ఎన్నికలు దగ్గరపడే కొద్దీ ఆ భ్రమలు వీడినట్టున్నాయి. ఇక చివరి నిముషంలో ఎం చేయాలో పాలుపోని వైసీపీ నేతలు ఇక తమకలవాటైన మాటల దాడిని మొదలుపెట్టారు. ఇందులో తల్లి చెల్లి అనే బంధాలకు, బంధుత్వాలకు ఎటువంటి చోటు లేదని స్వయంగా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డే ఆచరించి చూపించారు.
తన చెల్లి వైస్ షర్మిల ధరించిన పసుపు చీర మీద కూడా విమర్శలు చేసి రాష్ట్ర ప్రజల ముందు చులకనయ్యారు జగన్. ఒక రకంగా చూస్తే ఈ పసుపు చీర పై విమర్శలు చేయడం జగన్ సెల్ఫ్ గోల్ వేసుకున్నట్టే చెప్పాలి. దీనిని అందిపుచ్చుకున్న షర్మిల, కూటమి నేతలు ఆడవారి దుస్తుల పై ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి దిగజారి విమర్శించడం నిజంగా సిగ్గు చేటు అంటూ జగన్ మాటలను దూర్పారబట్టారు.
అదలా ఉంటే ఇప్పుడు జగన్ కంటే నాలుగు ఆకులు ఎక్కువ చదివిన పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థి వంగా గీత పోలింగ్ స్టేషన్ సందర్శిస్తున్న సమయంలో అక్కడ ఒక యువకుడు ఎర్ర తువాలు వేసుకుని కనిపించారు. ఇక అంతే వంగ గీత గారికి తిక్క నషాళాన్ని అంటినట్టుగా ఆ యువకుడి పై వాగ్వాదానికి దిగారు. ముందు ఆ ఎర్ర తుండు తీసేయాలి అంటూ సదరు ఓటర్ పై రెచ్చిపోయారు గీత.
ఎమ్మెల్యే అభ్యరి వాదనకు వెనక్కి తగ్గేదెలా అన్నట్టుగా ఆ వ్యక్తి కూడా ఇది కేవలం ఒక గుడ్డ ముక్క. దీని పై మీకు ఏంటి అభ్యంతరం అంటూ వంగా గీతకు ఎదురు ప్రశ్న వేయడంతో అక్కడ అధికారులు ఆ యువకుడికి నచ్చ చెప్పి అక్కడి నుంచి పంపించి వేశారు. పసుపు రంగు టీడీపీ పేంటంటే హక్కా..? ఆ రంగుని బాబు కొనుక్కున్నారా..? ఏపీలో పసుపు రంగు నిషేదించారు..? అంటూ షర్మిల జగన్ ను ఉతికారేస్తే ఇప్పుడు ఎర్ర తువాలు పై రచ్చ మొదలు పెట్టారు వైసీపీ నేతలు.
అయితే వంగా గీత వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఎర్ర తువాలు చూస్తే వైసీపీ నేతల వెన్నులో వణుకు పుడుతుందా..? వైసీపీ కి ఓటమి భయం చూపించింది ఈ ఎర్ర కండువానేనా..? ఎర్ర కండువా చూసి వంగా గీత భయపడ్డారా..? అంటూ వైసీపీ పార్టీని, వంగ గీతను సామజిక మాధ్యమాలలో ట్రోల్ చేస్తున్నారు. అలాగే జనసేన నేత నాగబాబు కూడా దీని పై స్పందిస్తూ గీతకు కౌంటర్ ఇచ్చారు.
ఎర్ర తువాల్ ను కాశీ తువ్వాలు అంటారు. దీనిని కష్టం చేసే ప్రతి కార్మికుడు ధరిస్తాడు. ఇది ధరించడం వారి హక్కు. తువ్వాలు ను వేసుకోవడాన్ని అడ్డుకోవడం అంటే అది చట్ట వ్యతిరేకమే అవుతుంది. తర్వాత మీ ఇష్టం అంటూ తన X లో స్పందించారు నాగబాబు. మొత్తానికి అప్పుడు పసుపు చీర ఇప్పుడు ఎర్ర తువాల్ తో తమ భయాన్ని చాటుకున్నారు జగన్, వంగా గీత అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు.




