భారతీయ బ్యాంకులకు బకాయి పడ్డ రుణాలను చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నట్లు పరారీలో ఉన్న పారిశ్రామికవేత్త విజయ్ మాల్యా తెలిపారు. మంగళవారం భారత్‌కు అప్పగింత విషయమై దాఖలైన పిటిషన్‌పై తుది వాదనలు వినిపించే నిమిత్తం లండన్‌లోని వెస్ట్‌మినిస్టర్ మేజిస్ట్రేట్ కోర్టుకు మాల్యా హాజరయ్యారు.
[m9ad]
భారతీయ బ్యాంకులకు రుణాలు చెల్లించాల్సిందిగా కోర్టు ఆదేశిస్తే చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. తనకు ఉన్న 14 వేల కోట్ల ఆస్తులను అమ్మకానికి పెట్టి రుణాలు చెల్లిస్తానని అయితే.. తనపై వస్తున్న మనీలాండరింగ్ ఆరోపణలు మాత్రం పూర్తిగా అవాస్తవమని ఆయన కొట్టిపారేశారు.
భారతీయ బ్యాంకులకు దాదాపు 9వేల కోట్ల మేర రుణాలను ఎగ్గొట్టి లండన్ పారిపోయిన మాల్యాను భారత్ రప్పించేందుకు ఇక్కడి అధికారులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. భారత్‌కు మాల్యా అప్పగింత విషయమై దాఖలైన పిటిషన్‌పై తీర్పును ఎప్పుడు వెలువరిస్తారనేది న్యాయమూర్తి ఈరోజు నిర్ణయిస్తారు. తీర్పు తనకు వ్యతిరేకంగా వస్తుందని ఆయన ఊహించి రుణాలు చెల్లించడానికి సిద్దమయినట్టు సమాచారం.



