ఏపీలో వైసీపీ ప్రభుత్వం ఓటర్ల జాబితాలను తారుమారు చేయడంపై టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు సోమవారం కేంద్ర ఎన్నికల కమీషన్ (సీఈసీ)కి ఫిర్యాదు చేశారు. ఈ విషయం తెలుసుకొని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అధ్వర్యంలో వైసీపీ నేతలు కూడా హడావుడిగా సీఈసీని కలిసి చంద్రబాబు నాయుడుపై ఫిర్యాదు చేశారు.
అనంతరం మీడియాతో మాట్లాడుతూ, “టిడిపి హయాంలోనే భారీగా దొంగఓట్లు నమోదయ్యాయి. ‘ఒక ఓటరుకి ఒకే ఓటు’ అనే ఈసీ సూచన ప్రకారమే మా ప్రభుత్వం రాష్ట్రంలో దొంగ ఓట్లను తొలగిస్తోంది. అందుకే చంద్రబాబు నాయుడు మాపై సీఈసీకి ఫిర్యాదు చేశారు. ఓటర్లను కులం, వారు ఏ పార్టీకి ఓట్లు వేయాలని అనుకొంటున్నారనే వివరాలు చెప్పాలని టిడిపి ప్రభుత్వం ఓటర్లపై ఒత్తిడి చేసి, లక్షలాది దొంగ ఓటర్లను నమోదు చేయించింది. వాటినే మేము తొలగిస్తుంటే చంద్రబాబు నాయుడు సీఈసీకి ఫిర్యాదు చేయడం హాస్యాస్పదంగా ఉంది,” అని అన్నారు.
· ఒకవేళ టిడిపి హయాంలో లక్షలాది దొంగ ఓట్లు నమోదు చేయించి ఉండి ఉంటే, వాటితో మళ్ళీ టిడిపియే ఎన్నికలలో గెలిచేది కదా? కానీ వైసీపీ గెలిచింది కదా?
· ఒకవేళ టిడిపి హయాంలో దొంగఓట్లు నమోదు చేసి ఉంటే, వాటిని వైసీపీ ప్రభుత్వం తొలగిస్తున్నట్లయితే, చంద్రబాబు నాయుడు సీఈసీకి ఫిర్యాదు చేసి హైపవర్ కమిటీని నియమించి విచారణ జరపాలని ఎందుకు కోరుతారు?విచారణ జరిపితే ఆయనే దొరికిపోతారు కదా?కానీ ఆయన విచారణ జరపాలని కోరుతుంటే, ‘అవసరం లేదు అంతా సవ్యంగానే ఉందని’ వైసీపీ చెపుతుండటాన్ని ఏమనుకోవాలి?
· మిగిలిన అన్ని అంశాల గురించి మాట్లాడిన విజయసాయి రెడ్డి, వాలంటీర్లతో రాష్ట్రంలో ఓటర్ల వ్యక్తిగత వివరాలు సేకరిస్తోందనే చంద్రబాబు నాయుడు ఫిర్యాదు గురించి ఎందుకు మాట్లాడలేదు?
· ఓటర్ల జాబితాలో ఎటువంటి అవకతవకలు జరుగడం లేదని వైసీపీ నేతలు వాదిస్తున్నప్పుడు, చంద్రబాబు నాయుడు సీఈసీని కలిసి ఫిర్యాదు చేస్తున్నారని తెలియగానే, అధికారంలో లేని చంద్రబాబు నాయుడుపై ఫిర్యాదు చేయడానికి ఎందుకు పరుగులు తీశారు?
ఒకవేళ వైసీపీ ప్రభుత్వం ఓటర్ల జాబితాలలో ఎటువంటి అవకతవకలకు పాల్పడనట్లయితే, ధైర్యంగా చంద్రబాబు నాయుడు ఫిర్యాదులని స్వాగతిస్తున్నామని చెప్పి, వాటిపై సీఈసీ సానుకూలంగా స్పందించి హైపవర్ విచారణ కమిటీని ఏర్పాటు చేసి విచారణ జరిపించాలని డిమాండ్ చేసి ఉండవచ్చు కదా?
పైన చెప్పుకొన్నా ఈ నాలుగు పాయింట్స్ గమనించిన్నట్లయితే, చంద్రబాబు నాయుడు చేసిన పిర్యాదులు నిజమని, వాటిపై సీఈసీ చర్యలు చేపడితే వైసీపీ తీవ్రంగా నష్టపోతుందనే ఆందోళనతోనే విజయసాయి రెడ్డి హడావుడిగా సీఈసీని కలిసిన్నట్లు స్పష్టమవుతోంది. కానీ అధికారంలో లేని చంద్రబాబు నాయుడుపై అధికారంలో ఉన్న వైసీపీ సీఈసీకి ఫిర్యాదు చేయడం అన్నిటికంటే పెద్ద విడ్డూరం!



