ట్విట్టర్ లో వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తలలో నిలిచే వైఎస్సార్ కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి కరోనా కారణంగా కొంత బ్రేక్ ఇచ్చినా ఇప్పుడు కోలుకుని మళ్ళీ మొదలెట్టారు. తాజాగా ఆయన అమరావతి వేసిన ట్వీట్ చర్చనీయాంశం అయ్యింది. రైతులకు ఎక్కడ నష్టం జరగనివ్వరని కూడా ఆయన అన్నారు. అంతవరకు అయితే పర్లేదు.
వికేంద్రీకరణ వల్ల అమరావతి అభివృద్ధికొచ్చిన నష్టమేమీ లేదు. మరింత వేగంగా అభివృద్ధి చెందుతుంది. ముఖ్యమంత్రి గారి AMRDA సమీక్ష చూస్తే ఆ విషయం అర్థమవుతుంది. రైతులకు ఎట్టిపరిస్థితుల్లోనూ అన్యాయం జరగదు. అయితే రియల్ ఎస్టేట్ బ్రోకర్లకు మాత్రం ఎవరూ హామీలివ్వలేరు అని విజయసాయి రెడ్డి అన్నారు.
అమరావతి రైతులకు అన్యాయం జరగదన్నారు సంతోషం… రియల్ ఎస్టేట్ బ్రోకర్లకు మాత్రం ఎవరూ హామీలివ్వలేరు అనడం ఏంటో అర్ధం కాలేదు. రియల్ ఎస్టేట్ అనేది ప్రభుత్వం గుర్తించిన వ్యాపారం. కొంత మంది అక్రమాలకు పాల్పడితే సహజంగానే వారికి ఎవరూ హామీ ఇవ్వరు. అసలు రియల్ ఎస్టేట్ చెయ్యడం అనేదే తప్పు అని అంటే మాత్రం తప్పే.
అన్ని వ్యాపారాల లాగే రియల్ ఎస్టేట్ అనేది కూడా ఒక వ్యాపారమే. అప్పుడు అమరావతిలో జరిగింది రేపు విశాఖపట్నంలో కూడా జరుగుతుంది. రైతుల తో పాటు చట్టపరిధిలో ఎవరు అమరావతిలో పెట్టుబడి పెట్టినా వారికి న్యాయం చెయ్యాల్సిందే. అది ప్రభుత్వం గుర్తిస్తే మేలు. వ్యాపారం చేసే వారిని… లాభం కోసం చూసేవాళ్ళని దొంగలుగా చూసే సంస్కృతి పోవాలి.





