వైఎస్సార్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ, ఆ పార్టీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి గత నెల 21న కరోనా పాజిటివ్ గా తేలి, హుటాహుటిన విజయవాడ నుండి హైదరాబాద్ వెళ్లి అక్కడి అపోలో హాస్పిటల్ లో జాయిన్ అయ్యారు. ఇన్నాళ్లు ట్రీట్మెంట్ లో ఉన్న ఆయన ఇప్పుడు కరోనా నుండి పూర్తి కోలుకున్నారట.
“భగవంతుడి దయతో, శ్రేయోభిలాషుల ప్రార్థనల బలంతో కోలుకున్నాను. అందరికీ కృతజ్ఞుడిని.🙏 మానవాళి అస్థిత్వానికి సవాలుగా మారిన కరోనాను ప్రతి ఒక్కరూ జయించాలని నిండు మనసుతో కోరుకుంటున్నాను,” అని ఆయన కాసేపటి క్రితం ట్వీట్ చేశారు. విజయసాయిరెడ్డి సరైన ట్వీట్ లో రీ-ఎంట్రీ ఇచ్చారని వైఎస్సార్ కాంగ్రెస్ అభిమానులు సంబరపడుతున్నారు.
“ముఖ్యమంత్రి జగన్ మూడు రాజధానుల కల సాకారమైంది. పచ్చ సోదరుల ఆర్తనాదాలతో ట్విట్టర్ హోరెత్తిపోతుంది. ఈ తరుణంలో విజయసాయి రెడ్డి గారు వారిని ట్విట్టర్ లో చీల్చి చెండాటటం ఖాయం. వారికి రక్త కన్నీరే,” అంటూ సంబరపడిపోతున్నారు.
టీడీపీ అభిమానులను టార్గెట్ చేస్తే పర్వాలేదు గానీ రాజధానికి భూములిచ్చి నష్టపోయిన రైతులను మాటలు అనకపోతే అదే చాలు. ఇది ఇలా ఉండగా… ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉన్నఫళంగా విశాఖకు తరలించే పనిలో పడ్డారు. విజయదశమి నాటికి మొత్తం ప్రభుత్వం అక్కడి నుండే పని చెయ్యాలని టార్గెట్ గా పెట్టుకున్నట్టు సమాచారం.



