వైసీపి అధికారంలో ఉన్నప్పుడు విజయసాయి రెడ్డి రాష్ట్రంలో కంటే ఢిల్లీలోనే ఎక్కువగా కనబడేవారు. మోడీ, అమిత్ షా లేదా కేంద్రమంత్రులతో ఫోటోలు దిగుతూ వాటిని సోషల్ మీడియాలో పెట్టుకునేవారు. ఆయన ఎంపీ కనుక రాష్ట్రానికి రావలసిన నిధులు, ప్రాజెక్టుల గురించి మోడీ, అమిత్ షాలతో తెగ మాట్లాడేస్తున్నారని అనుకోవడానికి రాష్ట్రంలో ఆయన సాధించినది ఏమీ కనపడదు.
మరైతే వాళ్ళ చుట్టూ ఆయన ఎందుకు తిరుగుతున్నారు?అంటే సమాధానం అందరికీ తెలుసు. తనకు సంబందించి వివిద స్టాండింగ్ కమిటీలలో పదవుల కోసమో లేదా రాజ్యసభ డెప్యూటీ ఛైర్మన్ పదవి కోసమో లేదా ప్రధాని నరేంద్రమోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షావంటి ప్రముఖులతో మంచి పరిచయాలు కలిగిన నేతగా గుర్తింపు సంపాదించుకోవడం కోసం కావచ్చు.
అలాగే అక్రమాస్తుల కేసులు, వివేకా హత్య కేసులు ముందుకు కదలకుండా బ్రేకులు వేయించేందుకు కావచ్చు. రాష్ట్రానికి సంబందించి జగన్ బటన్ నొక్కినప్పుడల్లా నిధులు విడుదల చేసేందుకు అప్పులు పుట్టించేందుకు కావచ్చు.
కారణాలు ఏవైనప్పటికీ విజయసాయి రెడ్డి ఢిల్లీలో ఎప్పుడూ ఒంటరిగా ఫోటో దిగిన సందర్భాలు చాలా తక్కువే అని చెప్పవచ్చు. డాలర్ శేషాద్రిలా విజయసాయి రెడ్డి పక్కన కూడా ఎప్పుడూ ఎవరో ఒక ప్రముఖుడు ఉండాల్సిందే.
అయితే ఇప్పుడు ఏపీలో వైసీపి ఓడిపోవడం, ఎన్డీయేలో చంద్రబాబు నాయుడు కీలకంగా మారడంతో అక్రమాస్తుల కేసులతో సహా అనేక ప్రమాదాలు పొంచి ఉన్నాయని జగన్, విజయసాయి రెడ్డి ఇద్దరూ గ్రహించిన్నట్లే ఉన్నారు. అందుకే విజయసాయి రెడ్డి మళ్ళీ ఢిల్లీకి షిఫ్ట్ అయిపోయి మళ్ళీ లాబీయింగ్ మొదలుపెట్టేశారనుకోవచ్చు.
ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాలు జరుగుతుండటం కూడా ఆయనకు కలిసి వచ్చింది. ఇప్పుడు ప్రధాని నరేంద్రమోడీతో సహా కేంద్రమంత్రులు అందరూ అక్కడే ఉంటారు.
కనుక ఫోటో దిగేందుకు విజయసాయి రెడ్డికి ఎవరో ఒకరు దొరక్కుండా ఉండరు. తాజాగా రైల్వేమంత్రి అశ్విన్ వైష్ణవ్‌తో ఫోటో దిగి సోషల్ మీడియాలో పెట్టుకున్నారు.
ఎందుకు కలిశారంటే ఏపీలో పెండింగ్ రైల్వే ప్రాజెక్ట్ పనులను కూడా పూర్తి చేయించాలని వినతి పత్రం ఇచ్చేందుకట! అలాగే విశాఖలో మెట్రో రైలు ప్రాజెక్ట్ ఏర్పాటు చేయాలని అడిగేందుకట!
మరి 5 ఏళ్ళు వైసీపి అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారు? అప్పుడే ఎందుకు అడగలేదు? అని ప్రజలకు ధర్మసందేహం కలిగితే తప్పు కాదు. కానీ నిద్రలో ప్రత్యేక హోదా అంటూ కలవరించిన్నట్లు అప్పుడూ అడిగాను… ఇప్పుడూ అడుగుతున్నాను. నాకు పదవులు, అధికారం కంటే రాష్ట్ర ప్రయోజనాలే నాకు ముఖ్యం అని విజయసాయి రెడ్డి చెప్పుకోవచ్చు. అందుకోసమే మళ్ళీ ప్రధాని నరేంద్రమోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాల చుట్టూ తిరుగుతున్నాను అని చెప్పుకోవచ్చు. కానీ మస్కా పాలిష్ కోసమే అని గిట్టనివారు అపార్ధం చేసుకుంటే ఆయన మాత్రం ఏం చేయగలరు?




