2024 ఎన్నికల ఫలితాలు వైసీపీ కి ఎన్నో చేదు జ్ఞాపకాలను తెచ్చిపెట్టగా, ఓటమి తరువాత నాయకుల నుంచి పార్టీ ఎదుర్కునే ఇబ్బందులు విజయసాయి రూపంలో జగన్ కు స్పష్టంగా తెలిసొచ్చాయి.
వైసీపీ కోసం ప్రత్యర్థుల పై నిరంతరం సోషల్ మీడియాలో వెటకారం, వ్యంగ్యం తో కూడిన పోస్టులు చేస్తూ తన సోషల్ మీడియాలో సాయి రెడ్డి ఎప్పుడు యాక్టీవ్ గా ఉండేవారు. ముఖ్యంగా బాబు, పవన్ మీద విరుచుకుపడిపోయేవారు.
పురంధరేశ్వరిని అడ్డుపెట్టుకుని బావ మరదళ్ళు అంటూ బాబు ని వెటకారంతో, ఉల్లిపాయంత ఉలుకు అంటూ పవన్ పై వ్యంగ్యం తో కూడిన పోస్టులు పెడుతూ వైసీపీ క్యాడర్ ను ఉత్తేజపరుస్తూ,
టీడీపీ, జనసేన శ్రేణులను రెచ్చకొడుతూ వైసీపీ రాజకీయం చేస్తూ బిజా బిజీ గా జగన్ కోసం ఢిల్లీ లాబీయింగ్ లు చేసేవారు. అటువంటిది ఒక్కసారిగా ఎవరు ఊహించని రీతిలో సాయి రెడ్డి వైసీపీ కి రాజీనామా చేసి రాజకీయాలకు వాలంటరీ రిటైర్ మెంట్ ప్రకటించారు.
నాడు వైసీపీ కి వీర విధేయుడిగా, జగన్ కు అత్యంత సన్నిహితుడిగా, పార్టీలో నెంబర్ – 2 గా చక్రం తిప్పిన సాయిరెడ్డి నేడు లిక్కర్ కేసులో ప్రధమ సాక్షిగా మారి అటు వైసీపీ ని ఇటు వైస్ జగన్ ను ఇరుకునపెట్టేలా కొన్ని ఆసక్తికర ప్రకటనలు చేసారు.
అయితే వైసీపీ కి రాజీనామ తరువాత సాయి రెడ్డి బీజేపీ తీర్ధం పుచ్చుకుంటారని ఎన్నో పుకార్లు వచ్చినప్పటికీ అది ముందుకు సాగలేదు. అటు జగన్ అక్రమాస్తుల కేసుల నుంచి ఇటు వైసీపీ లిక్కర్ స్కాం కేసు వరకు అన్నింటిలో సాయిరెడ్డి పాత్ర ఉండడంతో కూటమి పార్టీలలోకి సాయిరెడ్డి ఎంట్రీ రాష్ట్ర ప్రజలకు తప్పుడు సంకేతంగా మారుతుందని బీజేపీ పెద్దలను బాబు వారించినట్టు వార్తలు వచ్చాయి.
లిక్కర్ స్కాం కేసు లో ఇప్పటికే సిట్ అధికారులు సాయిరెడ్డి ని పలుమార్లు విచారించారు. అలాగే ఈ కేసులో సాయి అప్రూవర్ గా మారబోతున్నారు అంటూ సోషల్ మీడియాలో పుకార్లు కూడా పుట్టుకొచ్చాయి. ఈ నేపథ్యంలో విజయసాయి రెడ్డి అటు తెలుగు రాజకీయాలకు ముఖ్యంగా ఏపీ పొలటిక్స్ కు దూరంగా జరిగారు.
గతంలో ప్రత్యర్థి పార్టీల నాయకుల మీద విజయసాయి చేసే అవమానకర పోస్టులతో ఆయన సోషల్ మీడియా వైసీపీ మద్దతుదారులతో కళకళలాడుతూ ఉండేది. కానీ నేడు ఆయన రాజకీయాలకు వాలంటరీ రిటైర్మెంట్ ప్రకటించినట్టుగా తన సోషల్ మీడియాకు కూడా రాజకీయంగా కొంత గ్యాప్ ఇచ్చారు.
సాయి రెడ్డి పోస్టులలో మునుపటి మసాలా విమర్శలు లేకపోవడం, వ్యంగ్యాలు, వెటకారాలు పక్కన పెట్టడంతో పాటు వైసీపీ భజన చేయకపోవడంతో ఆయన సోషల్ మీడియా రీచ్ బాగా పతనమయ్యింది.






