
ఒక క్రికెటర్ లేదా మరో క్రీడాకారుడు రిటైర్‌మెంట్ ప్రకటిస్తే దాని కారణాలు అందరికీ స్పష్టంగా కనిపిస్తాయి. అదే… రాజకీయాలలో ఉన్నవారు రిటైర్‌మెంట్ ప్రకటిస్తే దానికీ కొన్ని కారణాలు కనిపిస్తాయి.
Also Read – వివేకా హత్యతో సంబందం లేకపోతే భయం దేనికి?
కానీ నిత్యం ప్రధాని మోడీ, అమిత్ అమిత్ అమిత్ షా, నిర్మలా సీతారామన్ వంటి ప్రముఖులతో ఫోటోలు దిగి సోషల్ మీడియాలో పెట్టుకునే విజయసాయి రెడ్డి వంటివారు రిటైర్‌మెంట్ ప్రకటిస్తే తప్పకుండా ఎవరైనా అనుమానిస్తారు.
ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ, “నేను రాజకీయాలలో ప్రవేశించినప్పటి పరిస్థితులు, ఇప్పుడు లేవు. ఈ పరిస్థితులలో నేను నా పార్టీకి, రాష్ట్రానికి, దేశానికి, ప్రజలకు సమర్ధంగా సేవ చేయలేనని భావిస్తున్నందునే ఈ నిర్ణయం తీసుకున్నాను. నేను తప్పుకుంటే నాకంటే సమర్ధంగా సేవ చేయగల వారికి అవకాశం లభిస్తుందనే ఎంపీ పదవికి కూడా రాజీనామా చేశాను.
Also Read – ఈ పైరసీల ఫాంటసీ ఏంటో..? దీనికి వాక్సిన్ లేదా.?
ప్రస్తుతం లండన్‌లో ఉన్న జగన్మోహన్ రెడ్డికి ముందుగా ఫోన్ చేసి నేను ఎందువల్ల ఈ నిర్ణయం తీసుకున్నానో వివరంగా చెప్పి ఆయన అనుమతి తీసుకున్న తర్వాతే ఈ ప్రకటన చేశాను,” అని విజయసాయి రెడ్డి చెప్పారు.
ఆయన చెప్పిన ప్రకారమే చూసినా ఎంపీ పదవిని వేరేవారికి కట్టబెట్టాల్సి ఉంది కనుకనే రాజీనామా చేసిన్నట్లు స్పష్టమవుతోంది.
Also Read – బురద జల్లుతున్నా బాబు ప్రతిష్ట ఇలా పెరిగిపోతోందేమిటి?
కానీ ఆయన రాజీనామా చేస్తే ఆ సీటు వైసీపీకి దక్కదు. కూటమిలో పార్టీలకే దక్కుతుంది… అని తెలిసి ఉన్నప్పటికీ ఆయన రాజీనామాని జగన్ ఆమోదించారంటే నమ్మశక్యంగా లేదు.
తమిళనాడులో జయలలిత చనిపోయిన తర్వాత శశికళ పార్టీని, ప్రభుత్వాన్ని తన అధీనంలోకి తీసుకోవాలని ప్రయత్నించినప్పుడు ఏం జరిగిందో తెలుసు. ఆమె జైలు నుంచి తిరిగి వచ్చాక మళ్ళీ రాజకీయాలలో చక్రం తిప్పడానికి సిద్దమయ్యారు. కానీ కొన్ని రోజులకే విజయసాయి రెడ్డిలా హటాత్తుగా ‘రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాను’ అని ప్రకటించారు.
విజయసాయి రెడ్డితో సహా కాకినాడ పోర్టు కబ్జాదారులందరూ పోర్టు యజమాని కేవీరావుకి దానిని తిరిగి అప్పగించేయడం, వెంటనే ఈ ప్రకటన చేయడం కాకతాళీయం కానే కాదు.
దేశంలో సరికొత్త మరియు అతిపెద్ద ఆర్ధిక నేరంగా పరిగణింపబడిన ఆ కేసు ఎంత గంభీరమైనదో అందరికీ తెలుసు. బహుశః దాని నుంచి ఉపశమనం-హామీ లభించినందునే విజయసాయి రెడ్డి ఈ నిర్ణయం తీసుకొని ఉండవచ్చు. ఈ వాదన నిజమో కాదో త్వరలోనే తెలుస్తుంది.
మావోయిస్టులు వయసు మీద పడి రోగాలు చుట్టుముట్టిన తర్వాత పోలీసులకు లొంగిపోయి ప్రభుత్వం నుంచి నజరానాలు తీసుకుని జనజీవన స్రవంతిలో కలిసిపోయిన్నట్లే, విజయసాయి రెడ్డి కూడా జనజీవన స్రవంతిలో కలిసిపోతున్నారు. కానీ ‘నజరానాలు’ ముట్టలేదంటే నమ్మశక్యంగా లేదు. ముట్టాయో లేదో రాబోయే రోజుల్లో మెల్లగా తెలుస్తుంది.
కానీ చేయకూడని నేరాలన్నీ చేసి ఇప్పుడు రాజకీయాల నుంచి తప్పుకుంటే ఆ పాపాలన్నీ తుడిచేసుకోవచ్చా? రాజకీయ పెద్దలు తమ పాపాలు కడుకొనేందుకు ఇంత సులువైన మార్గం ఉన్నప్పుడు, ఇక ఈ కోర్టులు, ఈడీలు, సీబీఐలు, విచారణలు అన్నీ వృధాయే కదా?