వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి శుక్రవారం బాపట్ల జిల్లాలో పార్టీ నేతలతో సమావేశమై జిల్లాలో పార్టీ పరిస్థితి, నియోజకవర్గం ఇన్‌ఛార్జ్‌ల పనితీరుని సమీక్షించారు. ఈ సందర్భంగా వారితో మాట్లాడుతూ, “రాష్ట్రంలో 87 శాతం కుటుంబాలకు సంక్షేమ పధకాల ద్వారా లబ్ధి కలిగించాము. కనుక రాష్ట్రంలో 51 శాతం పైగా ప్రజలు మనవైపే ఉన్నారు. ఈసారి ఎన్నికలలో 151 సీట్లు ఖచ్చితంగా గెలుచుకొంటాము. అంతకంటే ఎక్కువే గెలుచుకొంటాము తప్ప 151కి ఒక్క సీటు కూడా తగ్గదు.
ఈసారి ఎన్నికలలో వాలంటీర్లు మనకి చాలా కీలకం కానున్నారు. సంక్షేమ పధకాలను ప్రజలకు చేరవేయడంలో వాలంటీర్లు, సచివాలయ కన్వీనర్లు కీలక పాత్ర పోషిస్తున్నారు. కనుక పార్టీ నేతలందరూ వారి సేవలను ఉపయోగించుకొంటూ, ప్రతీ ఇంట్లో ఓటర్లను వైసీపీవైపు ఉండేలా జాగ్రత్తపడటం చాలా అవసరం,” అని అన్నారు.
విజయసాయి రెడ్డి మాటలతో జగన్ ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పధకాలన్నీ ఓట్ల కోసమేనని మరోసారి ధృవీకరించినట్లయింది. అలాగే ప్రజాధనంతో జీతాలు పొందుతున్న వాలంటీర్ల వ్యవస్థను వైసీపీ కోసమే ఏర్పాటు చేసుకొని ఉపయోగించుకొంటోందని కూడా స్పష్టమవుతోంది. వాలంటీర్లను ఎన్నికల ప్రక్రియకు దూరంగా ఉంచాలని కోర్టులు, ఎన్నికల సంఘం ఆదేశించినా, వారితోనే ఓటర్లను ప్రభావితం చేయించబోతోందని కూడా స్పష్టమవుతోంది.
మరో ముఖ్య విషయమేమిటంటే, ఈసారి 175 సీట్లు వైసీపీకే వస్తాయని జగన్ చెప్పుకొంటుంటే, విజయసాయి రెడ్డి 151 సీట్లు మాత్రమే వస్తాయని చెప్పడం. అప్పుడే ఆయన 24 సీట్లు కోతపెట్టేయడం గమనిస్తే వైసీపీ నేతల ప్రగల్భాలకు, వాస్తవాలకు చాలా దూరం ఉందని అర్దమవుతోంది. బహుశః ఎన్నికలు దగ్గర పదేశమయానికి ఈ సంఖ్య ఇంకా తగ్గుతుందేమో?
సిట్టింగ్ ఎమ్మెల్యేలలో 40 మంది పనితీరు బాగోలేదని ఐప్యాక్, 18 మంది పనితీరు బాగోలేదని జగన్ చెపుతుంటారు. కనుక వారిని మార్చక తప్పదని జగన్ స్వయంగా చెప్పారు కూడా. అంతకు ముందు కొందరు మంత్రుల పనితీరు నచ్చక పదవులలో నుంచి తొలగించారు. ఈ లెక్కన వైసీపీలో ఎంతమందికి విజయావకాశాలు ఉన్నట్లు?



