పిన్న వయసులోనే అనితర సాధ్యమైన రికార్డులకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తున్న విరాట్ కోహ్లి, తన జీవితంలో సెటిల్ అయ్యే ప్రయత్నం చేస్తున్నాడు. ‘ఇల్లు కట్టి చూడు – పెళ్లి చేసి చూడు’ అన్న నానుడి ప్రకారం ముందుగా తనకంటూ నివాసానికి ఓ లగ్జరీ అపార్ట్ మెంట్ ను కొనుగోలు చేసాడు.
ముంబైలోని వర్లీ ప్రదేశంలో ‘ఓంకార్ రియల్టర్స్ అండ్ డెవలపర్స్’ నిర్మించిన ప్రాజెక్ట్ లో ఏకంగా 34 కోట్ల రూపాయలు వెచ్చించి ఓ విలాసవంతమైన ఫ్లాట్ ను కొనుగోలు చేసాడు విరాట్. టవర్ – సీ విభాగంలో 35వ అంతస్తులో 7171 చదరపు అడుగులు గల విస్తీర్ణంలో అయిదు బెడ్ రూమ్ లు గల ఫ్లాట్ ను విరాట్ తన వశం చేసుకున్నాడని సమాచారం. ఈ ఫ్లాట్ నుండి నేరుగా సముద్రాన్ని వీక్షించే విధంగా సుందరంగా ఉంటుందని తెలుస్తోంది.
ఓ పక్కన క్రికెటర్ గా సంపాదించే మొత్తంతో పాటు, మరో పక్కన బ్రాండ్ అంబాసిడర్ గా విరాట్ కోహ్లి ఆదాయం కొన్ని వందల కోట్ల రూపాయలలోనే అన్న విషయం బహిరంగమే. దీంతో 34 కోట్ల అపార్ట్ మెంట్ పెద్ద విషయం కానప్పటికీ, గతేడాది ఇదే ప్రాజెక్ట్ లో 29వ అంతస్తులో గల ఒక ఫ్లాట్ ను యువరాజ్ సింగ్ కొనుగోలు చేయగా, తాజాగా కోహ్లి కూడా అందులోనే చేరడం విశేషం.



