‘కొడితే కొట్టాలిరా… డబుల్ సెంచరీ కొట్టాలి…’ అంటున్నాడు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి. వరుసగా నాలుగు టెస్ట్ సిరీస్ లను నాలుగు డబుల్ సెంచరీలు బాది సరికొత్త చరిత్ర సృష్టించాడు. అంతకు ముందు డాన్ బ్రాడ్ మన్, రాహుల్ ద్రావిడ్ ల పేరుతో ఉన్న మూడు డబుల్ సెంచరీల రికార్డులను బద్దలుకొడుతూ బంగ్లాదేశ్ పై 204 పరుగులు చేసాడు. విరాట్ చేసిన చివరి 5 టెస్ట్ మ్యాచ్ సెంచరీలలో 4 డబుల్ సెంచరీలు కావడం విశేషం.
వెస్టీండీస్ తో చేసిన 200 పరుగులతో మొదలైన విరాట్ వేట, న్యూజిలాండ్ పై 211, ఇంగ్లాండ్ పై 235 పరుగులు చేయగా, తాజాగా బంగ్లాదేశ్ పై 204 పరుగులు చేసాడు. అలాగే 2016 అక్టోబర్ మొదలుకుని, 2017 ఫిబ్రవరి వరకు ప్రతి నెలలో విరాట్ కోహ్లి సెంచరీ బాదుతూనే ఉన్నాడు. అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నెలల్లో టెస్ట్ మ్యాచ్ సెంచరీలు నెలకొల్పగా, జనవరిలో వన్డే సెంచరీ, ఫిబ్రవరిలో టెస్ట్ సెంచరీ నమోదు చేసాడు.
అలాగే ఒక సీజన్ లో ఇండియాలో అత్యధిక పరుగులు చేసిన సెహ్వాగ్ (1105) రికార్డును కోహ్లి కేవలం 9 టెస్ట్ మ్యాచ్ లలోనే దాటేసాడు. విరాట్ సాధిస్తున్న ఈ పరుగుల వరదతో ఇండియా కూడా పలు రికార్డులను నెలకొల్పింది. వరుసగా మూడు టెస్ట్ మ్యాచ్ లలో 600 పరుగులు దాటిన ఏకైక జట్టుగా టీమిండియా రికార్డులు సృష్టించింది. ఇంగ్లాండ్ తో 631, 759 తర్వాత బంగ్లాదేశ్ 687/6 వద్ద డిక్లేర్ చేసింది టీమిండియా.



