జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అభివృద్ధికి రెండు కొత్త నిర్వచనాలు చెప్పేవారు. 1. అభివృద్ధి అంటే సంక్షేమ పధకాలే. 2. మూడు రాజధానులు.
సంక్షేమ పధకాలతో ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయి కనుక అప్పుడు రాష్ట్రం కూడా అభివృద్ధి చెందిన్నట్లే అని జగన్ కనిపెట్టి చెప్పారు. ఐదేళ్ళపాటు అమలుచేశారు కూడా. వాటి కోసం చేసిన అప్పులతో రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయింది. అది వేరే విషయం.
విశాఖ రాజధాని అయితేనే ఉత్తరాంధ్ర జిల్లాలు అభివృద్ధి చెందుతాయని వితండవాదంతో కాలక్షేపం చేస్తూనే, ముందుగా రూ.500 కోట్లు ప్రజాధనం ఖర్చుచేసి జగన్ తన కోసం ఋషికొండపై విలాసవంతమైన ప్యాలసులు నిర్మించుకున్నారు. కానీ పాపం.. వాటిని అనుభవించక మునుపే అధికారం కోల్పోయారు. అది కూడా వేరే విషయం.
అయితే అభివృద్ధి అంటే ఈ రెండు కావని ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు నిరూపించి చూపిస్తున్నారు. ముందుగా అటు నెల్లూరు, చిత్తూరు నుంచి ఇటు శ్రీకాకుళం వరకు అనేక పరిశ్రమలు ఏర్పాటు చేయించి, వాటిలో లక్షల మందికి ఉద్యోగాలు కల్పించేందుకు కృషి చేస్తున్నారు.
పదకొండేళ్ళ క్రితం రాష్ట్రం విడిపోయినప్పుడు విశాఖపట్నంలో రైల్వే జోన్ ఏర్పాటు చేస్తామని కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. దానిని ఇప్పుడు అమలుచేయిస్తున్నారు ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు.
దాని కోసం ప్రభుత్వం రైల్వేశాఖకు 53 ఎకరాలు అప్పగించింది. దానిలో జోనల్ కార్యాలయం నిర్మాణం కొరకు రైల్వేశాఖ టెండర్లు పిలిచింది. రూ.149.16 కోట్ల అంచనా వ్యయంతో మొత్తం 11 అంతస్థులలో విశాఖ రైల్వే జోన్ ప్రధాన కార్యాలయం నిర్మించబోతోంది. వచ్చే నెలాఖరుకి ఈ టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి 2026 డిసెంబర్ నాటికి ఈ భావన నిర్మాణం పూర్తి చేయాలని రైల్వే శాఖ గడువు విదించింది.
విశాఖ, విజయవాడ నగరాలలో మెట్రో రైల్ ఏర్పాటుకి ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు గట్టిగా ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే భోగాపురం వద్ద అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. 2025 డిసెంబరు లోగా ముఖ్యమైన పనులన్నీ పూర్తిచేసి 2026 జనవరి నుంచి ఇక్కడి నుంచి విమానాలు నడపాలని లక్ష్యంగా పెట్టుకొని పనులు చేయిస్తున్నారు.
రాజధాని ప్రాంతం తప్పక అభివృద్ధి చెందుతుందనేది వాస్తవం. అయితే అభివృద్ధి చేయడానికి రాజధాని నిర్మించాల్సిన అవసరం లేదని ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు నిరూపించి చూపిస్తున్నారు. అభివృద్ధి అంటే ఋషికొండపై ప్రజాధనంతో విలాసవంతమైన ప్యాలస్ నిర్మించుకోవడం కాదు.. ఇదీ అని నిరూపిస్తున్నారు.




