ఏపీకి వచ్చేస్తోన్న ‘రైల్వే జోన్?’

Visakhapatnam-Railway-Stationఆంధ్రప్రదేశ్ కు ఇవ్వాల్సిన ‘ప్రత్యేక హోదా’ను కొన్ని సాంకేతిక కారణాల వలన ఇవ్వలేకపోతున్నామని, దానికి బదులుగా ప్రత్యేక ప్యాకేజ్ ను అందించామని కేంద్రం ఇచ్చుకున్న వివరణ తెలిసిందే. మరో ప్రత్యామ్నాయం లేక ముఖ్యమంత్రితో పాటు రాష్ట్ర ప్రజలు కూడా ఈ విషయాన్ని స్వీకరించారు. దీంతో ‘స్పెషల్ స్టేటస్’ అనేది ముగిసిపోయిన అధ్యాయంగా మారింది. మరి ‘స్పెషల్ స్టేటస్’ అంశంలో ఇలా చెప్పారు గానీ, ఏపీకి దక్కాల్సిన రైల్వే జోన్ విషయంలో కేంద్రం ఎందుకు ముందడుగు వేయడం లేదన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

దీనికి కూడా ఇతర రాష్ట్రాల నుండి అభ్యంతరాలు వస్తున్నాయని కాలం గడుపుతున్న కేంద్రం, ఈ ప్రక్రియను చివరి దశకు తెచ్చిందని, అతి త్వరలోనే ఆంధ్రప్రదేశ్ కు రైల్వే జోన్ ను కేటాయిస్తూ ప్రకటన వస్తుందని టిడిపి – బిజెపి ఉమ్మడి ఆభ్యర్దిగా పోటీ చేసి విజయం సాధించిన ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ పి.వి.ఎన్.మాధవ్ తెలిపారు. వైజాగ్ జర్నలిస్టు ఫోరం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘మీట్ ది ప్రెస్’ కార్యక్రమంలో పాల్గొన్న మాధవ్ మాట్లాడుతూ… ప్రత్యేక రైల్వే జోన్ ఏర్పాటు ప్రక్రియ పూర్తయిందని, ప్రకటన వెలువడటమే ఆలస్యమని, ఈ విషయమై రైల్వే మంత్రితో బీజేపీ నేతలు వెంకయ్య నాయుడు, హరిబాబు పూర్తి స్థాయి చర్చలు జరిపారని అన్నారు.

ADVERTISEMENT

మూడేళ్ళుగా నానుస్తూ వస్తున్న రైల్వే జోన్ ప్రకటన వెలువడకుంటే, బిజెపిపై రాష్ట్ర ప్రజలు మరింతగా ఆగ్రహించడం ఖాయంగా కనపడుతోంది. ‘స్పెషల్ స్టేటస్’పై వెనక్కి తగ్గినా, రైల్వే జోన్ పై తగ్గేది లేదని ఉత్తరాంధ్ర వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నేపధ్యంలో… తాజాగా మాధవ్ చెప్పిన కబురు, ఈ వేసవిలో చల్లదనాన్ని పంచుతోంది. మరి కేంద్రం నుండి అధికారిక ప్రకటన ఎప్పుడు వస్తుందోనని ఉత్తరాంధ్ర వాసులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ADVERTISEMENT
Latest Stories