జగన్ హయంలో విశాఖ రాజధాని అంటే విశాఖ నగర ప్రజలెవరూ మద్దతు పలుకలేదు. ఎందుకంటే అప్పటికే లక్షల కోట్ల విలువైన అమరావతి నిర్మాణంలో ఉంది. విశాఖ నగరంలో ప్రస్తుతం ఉన్న జనాభాకి, వాహనాలకే ఉన్న రోడ్లు సరిపోవు కనుక!
జగన్ ప్రభుత్వం విశాఖ రాజధాని అంటూ కాలక్షేపం చేసే బదులు పెరిగే జనాభా, వాహనాలకు సరిపోయే విధంగా నగరంలో ఎక్కడికక్కడ రోడ్ల విస్తరణ చేపట్టి, ఫ్లైఓవర్లు, అండర్ పాసులు నిర్మించి ఉన్నా ఆయనకు చిత్తశుద్ధి ఉందని ప్రజలు నమ్మేవారు. కానీ కనీసం రోడ్ల గుంతలు కూడా పూడ్చకుండా రుషికొండపై 500 కోట్లతో ప్యాలస్‌లు నిర్మించుకున్నారు. ఇప్పుడు మావిగన్ అంటూ మళ్ళీ నవ్వులపాలవుతున్నారు.
ఇప్పుడు చర్చ మావిగన్ గురించి కాదు. విశాఖ నగరం గురించి.
సిఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే విశాఖ శివారులో భోగాపురం వద్ద అద్భుతమైన అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మిస్తున్నారు. దానిని జూలై-ఆగస్ట్ నెలల్లో ప్రధాని మోడీ ప్రారంభించబోతున్నారు.
ఇది అందుబాటులోకి వస్తే అటు శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల ప్రయాణికులకు, ఇటు విశాఖ నగర ప్రజలకు ముఖ్యంగా విశాఖ తూర్పు, ఉత్తర నియోజకవర్గాల ప్రజలకు చాలా సౌకర్యవంతంగా ఉంటుంది.
కానీ ఈ కొత్త విమానాశ్రయం అందుబాటులోకి వస్తే ప్రస్తుతం ఎన్ఏడీ-గాజువాక జంక్షన్ మధ్యనున్న విమానాశ్రయం నేవీ చేతికి వెళ్ళిపోతుంది.
కనుక ఇకపై అటు అనకాపల్లి నుంచి, విశాఖ పశ్చిమ నుంచి ప్రయాణికులు నగరంలో ట్రాఫిక్ రద్దీ, సిగ్నల్స్ అన్నీ దాటుకుంటూ నగరానికి రెండో వైపున్న భోగాపురం విమానాశ్రయం చేరుకోవాల్సి ఉంటుంది. దీనికి కనీసం రెండు గంటలు పడుతుంది. చెకిన్ కోసం మరో రెండు గంటలు కలుపుకుంటే కనీసం నాలుగైదు గంటల ముందు బయలుదేరాలన్న మాట!
ఇప్పటికే ఇరుకు రోడ్లపై తిరిగే వేలాది వాహానాలతో నిత్యం రద్దీగా ఉంటాయి. ఇప్పుడు ఈ విమాన ప్రయాణికుల వాహనాలు కూడా కలిస్తే నగరంలో ట్రాఫిక్ రద్దీ విపరీతంగా పెరుగుతుంది. ఇది కాక నగరానికి గూగుల్ వంటి ఐటి కంపెనీలు, ఇనార్బిట్ మాల్ వంటి భారీ షాపింగ్ మాల్స్ వస్తున్నాయి. వాటితో నగరంలో జనాభా, వాహనాలు, ట్రాఫిక్ రద్దీ ఇంకా విపరీతంగా పెరిగిపోతుంది.
ఈ విషయం ప్రభుత్వానికి, జివీఎంసికి, స్థానిక ప్రజా ప్రతినిధులకు, మంత్రులకు తెలియదనుకోలేము. కానీ అందరూ భోగాపురం విమానాశ్రయం, గూగుల్ గురించే మాట్లాడుతుంటారు తప్ప ఎవరూ కొత్త ఫ్లై ఓవర్ల నిర్మాణం గురించి మాట్లాడరు!
జగన్ 5 ఏళ్ళలో ఒక్కటీ నిర్మించలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్ళు కావస్తున్నా ఇంతవరకు ఒక్కటీ నిర్మించలేదు. ఏమంటే వాటి కోసం ప్లానింగ్ జరుగుతోందంటారు.
‘డబుల్ డెక్కర్ ఫ్లై ఓవర్’ అంటూ రెండేళ్ళు వృధా చేశారు. అదే అప్పుడే నిర్మాణ పనులు మొదలు పెట్టి ఉంటే ఈపాటికి విశాఖలో కనీసం ఓ అరడజను ఫ్లై ఓవర్లు రెడీ అయ్యేవి. అప్పుడు భోగాపురం విమానాశ్రయం వెళ్ళేవారితో పాటు విశాఖ నగర ప్రజలు కూడా చాలా సంతోషించేవారు కదా? ఇప్పుడు ట్రాఫిక్ విపరీతంగా పెరిగిపోయిన తర్వాత ఇప్పటికే ఇరుకుగా ఉన్న రోడ్లను బ్లాక్ చేసి ఫ్లై ఓవర్ల కోసం తవ్వకాలు, నిర్మాణ పనులు మొదలుపెడితే పరిస్థితి ఇంకా దారుణంగా మారుతుంది కదా?
కేసీఆర్ హయంలో హైదరాబాద్‌లో దుర్గంచెరువు కేబిల్ బ్రిడ్జి నిర్మిస్తే దానిపై నిత్యం సినిమా షూటింగులు జరుగుతూనే ఉన్నాయి. వాటిని చూస్తున్నవారు, దానిపై ప్రయాణిస్తున్నవారు కేసీఆర్, కేటీఆర్ పేరు తలుచుకోకుండా ఉండరు. మరి విశాఖ ప్రజలు సిఎం చంద్రబాబు నాయుడు పేరు తలుచుకునేలా నగరంలో ఫ్లై ఓవర్లు నిర్మించలేరా?




