తమిళ హీరోగా స్థిరపడ్డ తెలుగు వాసి విశాల్, గతంలో జరిగిన నడిగర్ సంఘం ఎన్నికల్లో గెలవగా, తాజాగా 2017-19 సంవత్సరాలకు గాను తమిళ సినీ నిర్మాతల మండలి అధ్యక్షుడి ఎన్నికలలో ఘనవిజయం సాధించారు. విశాల్ నాయకత్వంలో ప్రకాష్ రాజ్, గౌతమ్ వాసుదేవ మీనన్ (ఉపాధ్యక్షులు), ఎస్‌ఆర్ ప్రభు (కోశాధికారి) కూడా గెలిచారు. తమిళ నిర్మాతల మండలిలో మొత్తం 1,212 మంది సభ్యులుండగా, 1059 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు.
అధ్యక్ష పదవికి పోటీచేసిన వారిలో విశాల్ కు 478, రాధాకృష్ణన్ కు 355, కేఆర్ కు 224 ఓట్లు వచ్చాయి. ఫస్ట్ రౌండు నుంచే విశాల్ ముందంజలో నిలవడం గమనార్హం. తనను గెలిపించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపిన విశాల్, నిర్మాతలు మార్పును కోరుకున్నారని, వారి మనోభావాలే తన గెలుపుగా మారాయని, ఇక తమ జట్టు అంకిత భావంతో పనిచేసి, నిర్మాతల కష్టాలను తీర్చేందుకు ప్రయత్నిస్తుందని, తమిళ సినిమాకు మరోసారి స్వర్ణయుగం తీసుకురావడమే లక్ష్యంగా పని చేస్తామని తెలిపారు.



