వైసీపీ ఓటమికి వాలంటీర్లు కూడా కారణమేనట!

Volunteers are also responsible for YSR Congress Party defeat

జగన్‌ 2019లో ముఖ్యమంత్రి కాగానే 2024లో జరుగబోయే ఎన్నికల గురించి ఆలోచించి వాలంటీర్ వ్యవస్థ సృష్టించారు. ఆ స్టోరీలన్నీ అందరికీ తెలుసు కనుక మళ్ళీ ఫ్లాష్ బ్యాక్ అనవసరం.

వాలంటీర్లను నమ్ముకొని జగన్‌ ఎన్నికలను మేనేజ్ చేసి గెలుద్దామనుకుంటే, వారిని ఎన్నికల ప్రక్రియకు దూరంగా ఉండాలని ఎన్నికల సంఘం హెచ్చరించడంతో జగన్‌కు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది.

ADVERTISEMENT

ఒకవేళ వారు ఎన్నికల ప్రక్రియలో పాల్గొని ఉండి ఉంటే ఫలితాలు తప్పకుండా వేరేలా ఉంటాయని జగన్‌ గట్టిగా నమ్మారు. అందుకే వాలంటీర్లు అందరూ తమ పదవులకు రాజీనామాలు చేసి ఎన్నికలలో వైసీపీ కోసం పనిచేయాలని వైసీపీ నేతలు, అభ్యర్ధుల చేత జగన్‌ ఒత్తిడి చేయించారు.

వాలంటీర్లలో చాలా మంది తామేదో గెజిటెడ్ ఆఫీసర్ పదవిలో ఉన్నామనుకున్నారని, జీతాలు పెంచుతామని చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీని నమ్మారే తప్ప 5 ఏళ్ళు నెలనెలా టంచనుగా జీతాలు ఇచ్చిన జగన్‌ని నమ్మలేదని అన్నారు. తాము వారికి ఎంతగా నచ్చ చెప్పినా రాజీనామాలు చేయలేదని, వైసీపీ ఓటమికి ఇదీ ఓ కారణమేనని మాజీ మంత్రి గుడివాడ అమరనాథ్ అన్నారు.

వాలంటీర్లకి ప్రభుత్వ ఖజానా నుంచి వేలకోట్లు జీతాలు చెల్లిస్తూ, వైసీపీ కోసం వాడుకున్నారని, ఎన్నికలలో కూడా వాడుకోవాలనుకున్నారని గుడివాడ అమరనాథ్ స్వయంగా బయటపెట్టారు కదా?వాలంటీర్లను నమ్ముకొని చాలా నష్టపోయామని కనుక ఇకపై వైసీపీ కార్యకర్తలకే ప్రాధాన్యం ఇస్తామని అన్నారు.

వైసీపీ గెలుపుకి వాలంటీర్లు కీలకమని చెప్పిన వైసీపీ నేతలే ఇప్పుడు తమ ఓటమికి వారే కారణం అని నిందిస్తుండటం విశేషం.

అయితే నెలకు కేవలం రూ.5,000కు వైసీపీకి వెట్టి చాకిరీ చేసిన వాలంటీర్లతో ఎన్నికల సమయంలో వైసీపీ నేతలు ఎంత దారుణంగా వ్యవహరించారో అందరికీ తెలుసు. ఎన్నికలు జరుగుతున్నప్పుడే వాలంటీర్లతో ఆవిదంగా వ్యవహరించిన వైసీపీ, ఓడిపోయిన తర్వాత వారిని పట్టించుకోలేదు.

తమ కోసం సృష్టించుకున్న వాలంటీర్లు రోడ్డున పడితే, వారిని ఆదుకోవలసిన బాధ్యత సిఎం చంద్రబాబు నాయుడుదే అని సింపుల్‌గా చేతులు దులుపుకున్నారు.

ఎందుకంటే, అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వ ఖజానా నుంచి వారికి జీతాలు చెల్లించేవారు. కానీ ఓడిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి, వైసీపీ నేతలు తమ జేబుల్లో నుంచి తీసి ఇవ్వాల్సి ఉంటుంది. కనుక వారి అవసరం లేదని ‘యూజ్ అండ్ త్రో’ అన్నట్లు వదిలేశారు.

వాలంటీర్ల వలన వైసీపీ నష్టపోవడం ఎంత నిజమో, వైసీపీ వలన వాలంటీర్లు అంతకంటే చాలా ఎక్కువే నష్టపోయిన మాట కూడా వాస్తవం. ఇకపై పార్టీ కార్యకర్తలకే ప్రాధాన్యం ఇస్తామని గుడివాడ అమర్నాథ్ చెప్పడం గమనిస్తే, ఈ విషయంలో టీడీపీ విధానమే సరైనదని మరోసారి స్పష్టమైంది. టీడీపీ నాయకుల బలంతో కాక కార్యకర్తల బలంతోనే నడుస్తుందని సిఎం చంద్రబాబు నాయుడు పదేపదే చెపుతుంటారు. ఇందుకు సార్వత్రిక ఎన్నికల ఫలితాలు, తెలంగాణలో ఖమ్మం జిల్లాలో తెలంగాణ కాంగ్రెస్‌ నేతల గెలుపు చక్కటి నిదర్శనాలుగా కనిపిస్తున్నాయి కూడా.

ADVERTISEMENT
Latest Stories