జగన్ తన స్వార్ధ రాజకీయ ప్రయోజనాల కోసం సృష్టించిన త్రిశంకు స్వర్గమే ‘వాలంటీర్స్ వ్యవస్థ.’ చట్టబద్దత, ఉద్యోగ భద్రత, కనీస వేతనాలు లేని ఏకైక వ్యవస్థ ఇది. వాలంటీర్ల చేత 5 ఏళ్ళ పాటు వెట్టి చాకిరీ చేయించుకున్న జగన్, ఎన్నికలలో ఓడిపోగానే వారిని పట్టించుకోవడం మానేసి, వారి బాధ్యత కూటమి ప్రభుత్వానిదే అని వితండవాదం చేస్తుండటం విడ్డూరంగా ఉంది.
జగన్ సృష్టించుకున్న వాలంటీర్ వ్యవస్థని వాడుకునేందుకు టీడీపీ కూటమి ప్రభుత్వం సుముఖంగా లేకపోవడంతో వారు రోడ్డున పడ్డారు. వాలంటీర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు గోవిందరాజులు నేతృత్వంలో నేడు వాలంటీర్లు బెజవాడ కనకదుర్గమ్మని దర్శించుకొని అమ్మవారికి వినతి పత్రం అందజేశారు.
Also Read – రాజధాని రైతులని వేధించి ఇప్పుడు మొసలి కన్నీళ్ళా?
గోవిందరాజులు విలేఖరులతో మాట్లాడుతూ, “ఎన్నికల సమయంలో వాలంటీర్లను కొనసాగిస్తామని, జీతం పెంచి నెలకు పదివేలు ఇస్తామని చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. కానీ అధికారంలోకి వచ్చాక మాట తప్పారు. ఇప్పటికైనా మాట నిలబెట్టుకొని వాలంటీర్లను తిరిగి ఉద్యోగాలలోకి తీసుకోవాలని అమ్మవారికి మొర పెట్టుకున్నాము,” అని అన్నారు.
నెలకు కేవలం రూ.5,000 జీతం గల వాలంటీర్ల ఉద్యోగాల కోసం వారు ఇంతగా ఆరాటపడుతున్నారంటే, వారి ఆర్ధిక పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్దం చేసుకోవచ్చు.
Also Read – కేసీఆర్ చరిత్రని రేవంత్ తుడిచేయగలరా?
కానీ వైసీపీ కోసం 5 ఏళ్ళు పనిచేసిన వారందరికీ వైసీపీ-టీడీపీ రాజకీయాల పట్ల కూడా పూర్తి అవగాహన ఉండే ఉంటుంది. కనుక తమని కూటమి ప్రభుత్వం మళ్ళీ ఉద్యోగాలలో తీసుకుంటుందని ఆశపడుతూ సమయం వృధా చేసుకోవడం మంచిది కాదు.
ముఖ్యంగా తమని రోడ్డున పడేసి పోయిన వైసీపీ నేతల మాటలు నమ్మి, వారు ఆడుతున్న ఈ రాజకీయ చదరంగంలో పావులుగా మారితే చేజేతులా కొత్త సమస్యలు కొని తెచ్చుకున్నట్లే అని గ్రహించాలి.
Also Read – ఈవీఎంలా.. వాస్తు దోషాలా.. ఏవి దెబ్బేశాయబ్బా?
కనుక వారు వాలంటీర్ ఉద్యోగాల కోసం తమ సమయాన్ని వృధా చేసుకునే బదులు, వేరే ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చే సుకోవడం మంచిది.
ఈరోజుల్లో ఏ మాత్రం పనిచేయగల సామర్ధ్యం ఉన్న నెలకు పదివేల రూపాయలు సంపాదించుకోవడం పెద్ద కష్టం కాదు. కనుక వాలంటీర్లు ఇప్పటికైనా సరైన ఉద్యోగం, ఉపాధి కోసం ప్రయత్నించుకుంటే మంచిది. కాదని ఇటువంటి పోరాటాలు, రాజకీయాలు చేస్తుంటే వారే నష్టపోతారు. ఈ చేదు నిజం ఎంత త్వరగా గ్రహిస్తే అంత వారికే మంచిది.