గడిచిన కొద్ది నెలలుగా సినీ సెలబ్రిటీలపై యూ ట్యూబ్ లో పోస్ట్ చేస్తోన్న వీడియోలపై, పెడుతున్న టైటిల్స్ పై చాలా మంది సెలబ్రిటీలు స్పందించిన విషయం తెలిసిందే. అయినప్పటికీ వీరి పోకడ ఏ మాత్రం ఆగడం లేదని, వీరి సృజనాత్మకతను క్లిక్స్ కోసమే వాడుకుంటున్నారని చెప్పడానికి నిదర్శనంగా సోషల్ మీడియాలో కొన్ని స్క్రీన్ షాట్స్ సందడి చేస్తున్నాయి.
‘భరత్ అనే నేను’ సినిమా ప్రమోషన్ లో మహేష్ – కొరటాల – కేటీఆర్ లు పాల్గొన్న విషయం తెలిసిందే. ఇటీవల ఈ వీడియో విడుదల కాగా, అందులో కేటీఆర్ చేసిన కొన్ని వ్యాఖ్యలను తీసుకుని, అలాగే మహేష్ – నమ్రతల ఫోటోలను పోస్ట్ చేస్తూ… చెప్పిన సందర్భాన్ని వదిలేసి, డబుల్ మీనింగ్ రీతిలో పోస్ట్ లు పెట్టడం, నిజంగా ‘భరత్ అనే నేను’లో ప్రెస్ మీట్ సన్నివేశాన్ని మరొకసారి గుర్తుకు తెస్తోంది.
“మహేష్ – నమ్రతలు కలిసి హాలిడే ట్రిప్ లకు వెళ్తున్నారని, దీంతో తన భార్యతో గొడవలు వస్తున్నాయని కేటీఆర్ చమత్కరించిన విషయాన్ని” ఈ యూ ట్యూబ్ క్రియేటివిటీ దారులు ఇలా క్లిక్స్ కోసం వినియోగించుకోవడం ఏహ్యమైన చర్య. ఇలా ఒకటేమిటి… ప్రతి సందర్భంలోనూ, సెలబ్రిటీలు చెప్పింది ఒకటైతే, వాళ్ళు రాసేది, చేసేది మరొకటిలా మారింది. ఇలాంటి పోకడలే సెలబ్రిటీలకు ఆగ్రహాన్ని తెప్పిస్తున్నాయి.



