తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌కు సిఎం కేసీఆర్ మద్య మొదలైన యుద్ధంలో ఇరువర్గాలు ఏమాత్రం వెనక్కు తగ్గకపోవడంతో క్రమంగా ముదురుతోంది. గవర్నర్ కోటాలో టిఆర్ఎస్ నేత పాడి కౌశిక్ రెడ్డిని ఎమ్మెల్సీగా నియమించాలని సిఎం కేసీఆర్ సిఫార్సును గవర్నర్ ఆమోదించకుండా పక్కన పెట్టడంతో ఆయన అహం దెబ్బ తింది. అప్పటి నుంచే గవర్నర్‌ను సిఎం కేసీఆర్ దూరం పెట్టడం ప్రారంభించారు.
ఇది గమనించిన ఆమె సమస్యను మాట్లాడుకొని సామరస్యంగా పరిష్కరించుకొందామని సూచించినా సిఎం కేసీఆర్ స్పందించలేదు. అప్పటి నుంచి తెలంగాణ ప్రభుత్వం తమిళిసై సౌందరరాజన్‌కి ప్రోటోకాల్ పాటించడం మానేయడమే కాకుండా గవర్నర్ ఓ బిజెపి నేతలాగ వ్యవహరిస్తూ రాజకీయాలు చేస్తున్నారని, తన పరిధిని అతిక్రమించి ప్రభుత్వానికి సమస్యలు సృష్టిస్తున్నారని, రాజ్‌భవన్ బిజెపి కార్యాలయంలా మార్చేశారంటూ టిఆర్ఎస్ మంత్రులు, నేతలూ తీవ్ర విమర్శలు చేస్తున్నారు.
గవర్నర్ విచక్షణాధికారానికి లోబడి జరిగే ఎమ్మెల్సీ నియామకం విషయంలోనే సిఎం కేసీఆర్ అహం దెబ్బ తింటే, తెలంగాణ ప్రభుత్వం, మంత్రులు, అధికారులు అడుగడుగునా ఇంతగా అవమానిస్తుంటే తమిళిసై సౌందరరాజన్ అహం దెబ్బ తినకుండా ఉంటుందా?
అందుకే ఆమె ఢిల్లీ వెళ్ళి ప్రధాని నరేంద్రమోడీ, కేంద్రహోంమంత్రి అమిత్ షాలను కలిసి ఫిర్యాదు చేశారు. వారు ఆమెకు వారు ఏమి చెప్పారో తెలీదు కానీ వారితో భేటీ తరువాత ఆమె తెలంగాణ ప్రభుత్వం, సిఎం కేసీఆర్, ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేష్ కుమార్ తదితరులపై ఘాటుగా విమర్శలు చేశారు. ప్రోటోకాల్ వివాదాన్ని కేంద్రప్రభుత్వమే చూసుకొంటుందని చెప్పారు. అంటే ఈ వ్యవహారంలో కేంద్రం జోక్యం చేసుకోబోతోందని ఆమె తొలి సంకేతం ఇచ్చినట్లే భావించవచ్చు.
ఆ తరువాత ఆమె రైల్లో భద్రాచలం వెళ్ళవలసి రావడం, మంత్రులు ఆమెపై విమర్శలు కొనసాగిస్తుండటం గమనిస్తే టిఆర్ఎస్ ప్రభుత్వం ఆమెతో యుద్ధం కొనసాగించేందుకే మొగ్గు చూపుతున్నట్లు స్పష్టం చేస్తోంది.
ఆమెను అడ్డుపెట్టుకొని కేంద్రం తమ ప్రభుత్వాన్ని కూలద్రోసేందుకు కుట్రలు చేస్తోందని ప్రజలకు నమ్మకం కలిగించేందుకు టిఆర్ఎస్ ఈవిదంగా వ్యవహరిస్తున్నట్లు భావించవచ్చు. టిఆర్ఎస్ వ్యూహం ఫలిస్తుందో లేదో తెలీదు కానీ ప్రోటోకాల్ పాటించనందుకు చర్యలు తీసుకొనే అవకాశం సిఎం కేసీఆర్ చేజేతులా కేంద్రప్రభుత్వానికి కల్పిస్తున్నట్లయింది.
అయితే తెలంగాణ రాష్ట్రం పట్ల కేంద్రం పగపట్టినట్లు వ్యవహరిస్తోందని వాదిస్తూ ప్రజలలో తెలంగాణ సెంటిమెంట్ రగిల్చి రాష్ట్రంలో బిజెపిని దెబ్బ తీయాలని ప్రయత్నిస్తున్న టిఆర్ఎస్ ఒకవేళ కేంద్రం తమ ప్రభుత్వం లేదా అధికారులపై చర్యలు తీసుకొన్నట్లయితే, దానినీ తనకు అనుకూలంగా మలుచుకోవచ్చు. అయితే టిఆర్ఎస్, బిజెపిల మద్య జరుగుతున్న ఈ రాజకీయ ఆధిపత్యపోరులో చివరికి ఐఏఎస్, ఐపీఎస్ అధికారులే బలిపశువులుగా మారవచ్చు.



