ఆత్మసాక్షి చేయలేని పనిని ఆ వెబ్‌సైట్‌ చేస్తోందా?

War of words between YS Sharmila  Mla Jagga Reddyప్రతీ రాజకీయ పార్టీకి సొంత డప్పు కొట్టుకోవడానికి, తమ ప్రత్యర్దులపై దుష్ప్రచారం చేయడానికి సొంత మీడియా అవసరమని వైసీపీని స్థాపించకమునుపే జగన్మోహన్ రెడ్డి గ్రహించి ‘ఆత్మసాక్షి’ని ఏర్పాటుచేసుకొన్నారు. అది ఇప్పుడు అధికారంలో ఉన్న ఆ పార్టీకి ఎంతగా ఉపయోగపడుతోందో అందరూ చూస్తూనే ఉన్నారు. దానిలో వైసీపీ సొంత డప్పు, టిడిపిపై నిత్యారోపణలు, విమర్శలతో కధనాలు వస్తుంటాయి. నిజం చెప్పాలంటే ఆత్మసాక్షి వైసీపీకి రాజకీయ మిత్రపక్షంగా వ్యవహరిస్తోందని చెప్పుకోవచ్చు.

ఇంతకీ విషయం ఏమిటంటే, సిఎం జగన్మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిల అన్నతో విభేదించి తెలంగాణకు వెళ్ళిపోయి సొంత కుంపటి పెట్టుకొన్నప్పుడు, వైసీపీకి ముఖ్యంగా… సిఎం జగన్మోహన్ రెడ్డికి రాజకీయంగా అది చాలా ఇబ్బందికరంగా మారింది. అప్పుడు ‘ఆత్మసాక్షి’ ఆ సమస్య తీవ్రతను తగ్గించేవిదంగా కధనాలు ప్రచురించి, ప్రసారం చేసింది.

ADVERTISEMENT

ఆ తర్వాత ఇంతవరకు వైఎస్ షర్మిలతో సిఎం జగన్మోహన్ రెడ్డికి, వైసీపీకి ఎటువంటి ఇబ్బందీ రాలేదు కనుక ‘ఆల్ ఈజ్ వెల్’ అన్నట్లు తెలంగాణలో ఆమె మహాప్రస్థానం ఏవిదంగా సాగుతోందో అప్పుడప్పుడు వార్తలు ప్రచురిస్తోంది.

అయితే ఇటీవల వైఎస్ షర్మిల ఇటీవల సంగారెడ్డిలో పాదయాత్ర చేస్తున్నప్పుడు స్థానిక కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జగ్గారెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో, ఆయన వెంటనే వరుస ప్రెస్‌మీట్లు పెట్టి ఆమెను, ఆమె అన్నని, వైఎస్ కుటుంబంపై తీవ్ర విమర్శలు, ఆరోపణలు చేస్తున్నారు. వైఎస్ షర్మిల, జగ్గారెడ్డి పరస్పరం చేసుకొంటున్న తీవ్ర ఆరోపణలతో మళ్ళీ సిఎం జగన్మోహన్ రెడ్డికి, వైసీపీకి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురవుతున్నాయి.

వైఎస్ షర్మిల తన తండ్రి ప్రమాదంలో చనిపోలేదని కొందరు కుట్ర చేసి హత్య చేశారని ఆరోపించారు. ఇది సిఎం జగన్మోహన్ రెడ్డికి ఎంత ఇబ్బందికరంగా ఉంటుందో ఊహించుకోవచ్చు. ఇక ఎమ్మెల్యే జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడుతూ, “వైఎస్ మరణించినప్పుడు కాంగ్రెస్‌ నేతలు, కార్యకర్తలు అందరం ఆయన శవం ముందు కూర్చొని కన్నీళ్ళు పెట్టుకొంటుంటే, లోపల అన్నా, చెల్లీ ఇద్దరూ ముఖ్యమంత్రి పదవి కోసం స్కెచ్ వేసుకోవడం చూసి నేను చాలా ఆశ్చర్యపోయాను. ఇది నేను నా కళ్ళారా చూసి చెపుతున్న మాట!” అని అన్నారు.

జగ్గారెడ్డి అంతటితో ఆగలేదు… “మీ అన్నాచెల్లెల మద్య పదవులు పంచాయతీ ఉంటే మూడు రాజధానులు బదులు మూడు రాష్ట్రాలుగా ఏపీని విభజించుకొని ముఖ్యమంత్రులు అయిపోవచ్చు కదా మీ కుటుంబ పంచాయతీని ఇక్కడ మా తెలంగాణ ప్రజలపై రుద్దడం దేనికి?” అంటూ ఇంకా చాలా విమర్శలు చేశారు.

దీనికంతటికీ కారణం వైఎస్ షర్మిల తెలంగాణలో పాదయాత్ర చేస్తూ అక్కడి రాజకీయ నేతలను విమర్శిస్తుండటమే అని అర్దమవుతోంది. కానీ ఇప్పుడు ఆమెను ఎవరూ వారించలేరు. అలాగని సమర్ధించలేరు కూడా.

తన మరణంతో వైసీపీకి ప్రాణం పోసిన వైఎస్ మరణంపై జరుగుతున్న ఈ రచ్చకు కారణమైన వైఎస్ షర్మిలను ఆత్మసాక్షి కూడా మందలించలేని పరిస్థితి.

కనుక ఇప్పుడు ఆ బాధ్యతను వైసీపీకి డప్పు కొట్టే ఓ ప్రముఖ తెలుగు వెబ్‌సైట్‌ స్వీకరించి, ఆమెను సున్నితంగా విమర్శిస్తూ ఓ కధనం ప్రచురించింది. ఆమె భౌగోళిక, రాజకీయ వాస్తవ పరిస్థితులను గమనించకుండా తొందరపడి పార్టీ పెట్టారని, కాళ్ళరిగిపోయేలా పాదయాత్ర చేస్తున్నా ప్రజల నుంచి స్పందనరాకపోవడంతో తీవ్ర నిరాశ చెందుతున్నారని, ఏ జిల్లాలో ప్రవేశిస్తే అక్కడి స్థానిక నేతలను విమర్శిస్తూ అందరి దృష్టిని ఆకర్షించాలని ప్రయత్నిస్తున్నారని దానిలో పేర్కొంది.

కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జగ్గారెడ్డిపై తాను చేసిన విమర్శలకు ఆయన ధీటుగా స్పందిస్తుండటంతో ఆమె ఆనందానికి అవధులు లేవని వ్రాసింది. ఇన్నాళ్ళకు రాజకీయ నాయకులను ఎలా రెచ్చగొట్టాలో ఆమె తెలుసుకొన్నారని, ఆమె ఉద్దేశ్యపూర్వకంగానే తనను రెచ్చగొడుతున్నారనే సంగతి జగ్గారెడ్డి గ్రహించలేకపోయారని వ్రాసింది. వారి పరస్పర ఆరోపణలతో వైఎస్సార్ పరువు పోతోందని వైఎస్ షర్మిల గుర్తించకపోవడం చాలా బాధాకరమని వ్రాసింది. అంటే వైసీపి ఆత్మసాక్షి నోటిలో మాటను ఆ వెబ్‌సైట్‌ చెప్పిందన్నమాట! లేదా దాని ద్వారా చెప్పించారనుకోవచ్చు.

ADVERTISEMENT
Latest Stories