జగన్ కుటుంబంలో ఆస్తులు, పదవుల కోసం కీచులాటలు జరిగి షర్మిల తెలంగాణలో సొంత కుంపటి పెట్టుకున్నప్పుడు, తిరిగివచ్చి అన్నతో యుద్ధాలు మొదలుపెట్టినప్పుడు, ఆస్తుల కోసం తల్లిని, చెల్లిని జగన్ కోర్టుకు ఈడ్చినప్పుడు, అందరూ తెలంగాణలో కేసీఆర్ కుటుంబాన్ని చూసి నేర్చుకోమనేవారు.
కానీ కేసీఆర్ కుటుంబంలో కూడా పదవుల కోసం కీచులాటలు జరుగుతున్నాయని కల్వకుంట్ల కవిత బయట పెట్టేయడంతో చివరికి ఈ విషయంలో కూడా జగన్, కేసీఆర్ కుటుంబాలు ఒకే బాటలో పయనిస్తున్నాయని స్పష్టమైంది.
నిజానికి షర్మిల, కవితలకి మంత్రి పదవులు ఇచ్చి ఉండి ఉంటే బహుశః నేడు వారి కుటుంబాలలో ఈ చిచ్చు రగిలి ఉండేది కాదేమో? కానీ కేసీఆర్, జగన్ వేర్వేరు కారణాల వలన వారిని పక్కన పెట్టశారు. అదే ఇప్పుడు వారి కొంప ముంచింది.
కుటుంబ పాలన, వారసత్వ రాజకీయాలంటూ ఎన్ని విమర్శలు వస్తున్నా ప్రాంతీయ పార్టీలను ప్రజలు ఆదరిస్తూనే ఉన్నారు. కనుక నాడు కేసీఆర్, జగన్ ధైర్యం చేసి వీర విధేయులైన, అత్యంత శక్తివంతమైన ఆ ఆ ఇద్దరు మహిళలకు మంత్రి పదవులు ఇస్తే ఎంతో కొంత లాభమే తప్ప కొత్తగా వచ్చే నష్టం ఏమీ ఉండేది కాదు.
ఇప్పుడు ఈ రెండు కుటుంబాలలో జరిగిన, ఇంకా జరుగుతున్న గొడవల వలన రెండు పార్టీలు రాజకీయంగా నష్టపోతున్నాయి.
ముఖ్యంగా ఎన్నికలలో ఓటమి తర్వాత రెండు పార్టీలు బలహీనంగా మారినప్పుడు కవిత, షర్మిలల సహాయ సహకారాలు కోల్పోవడమే కాకుండా, వారే ఆ పార్టీలకు ప్రధాన శత్రువులుగా మారారు. ఇది ఇంకా నష్టం కలిగిస్తోంది.
కల్వకుంట్ల కవిత బిఆర్ఎస్ పార్టీలో నుంచి బయటకు వెళ్లిపోయినా కేసీఆర్‌కు కేటీఆర్, హరీష్ రావు ఇద్దరు అండగా ఉన్నారు. వారి మద్య కూడా విభేధాలు పెరిగితే బిఆర్ఎస్ పార్టీ పరిస్థితి చెప్పలేము. పైగా బీజేపిలో బిఆర్ఎస్ పార్టీ విలీనం చేసేయాలనే ఆలోచన ఉందని కల్వకుంట్ల కవిత స్వయంగా బయటపెట్టారు. కనుక హరీష్ రావు కూడా బయటకు వెళ్ళిపోతే చివరికి జరిగేది అదే.
కానీ వైసీపీకి అటువంటి అవకాశాలు ఒక్కటి కూడా కనపడటం లేదు. ఇంత జరిగిన తర్వాత షర్మిలని మళ్ళీ వైసీపీలోకి తెచ్చుకోవడం అసంభవం. తల్లి ప్రేమ కొడుకుని ఆశీర్వదించగలదు కానీ పార్టీని నడిపించలేదు. ఒకవేళ ఉన్నా కొడుకు ఎలాంటివాడో అనుభవపూర్వకంగా తెలుసుకున్న తర్వాత విజయమ్మ మళ్ళీ వస్తారనుకోలేము. వస్తే అవసరం తీరాక మళ్ళీ అలాగే మరోసారి బయటకు గెంటేస్తాడని విజయమ్మకు తెలుసు.
కనుక ఇప్పుడు వైసీపీ, బిఆర్ఎస్ పార్టీల పరిస్థితిని ఓసారి బేరీజు వేసుకొని చూస్తే, ఒకవేళ మద్యం కుంభకోణం కేసులో జగన్ జైలుకి వెళితే వైసీపీ పరిస్థితి ఆగమ్యగోచరంగా మారుతుందని అర్దమవుతుంది.




