మంత్రివర్గ విస్తరణలో మళ్ళీ మరోసారి పదవి పొందడం చాలామంది గొప్పగానే భావిస్తారు. అయితే మంత్రి బొత్స సత్యనారాయణ మాత్రం చాలా ఇబ్బంది పడుతున్నారు. ‘గట్టిగా నాలుగు ముక్కలు ఇంగ్లీషులో మాట్లాడటలేని ఆయనకు విద్యాశాఖను అప్పజెప్పడం ఏమిటని… సీనియర్ మంత్రి అయిన ఆయనను జగన్ ఈవిదంగా అవమానించడం తగదంటూ…’ సోషల్ మీడియాలో వస్తున్న జోకులకు అంతే లేదు. బహుశః అందుకేనేమో మంత్రిగా ప్రమాణస్వీకారం చేసి పది రోజులవుతున్నా బొత్సవారు ఇంతవరకు బాధ్యతలు చేపట్టలేదు. దాంతో విద్యాశాఖలో అధికారులు ఆయన ఇంటికి వెళ్ళి పిలుచుకురాలేక మంత్రి గారి సంతకాలు, సమీక్షలు లేకుండానే లాగించేస్తున్నారు.
కారణాలేవైతేనేమి, బొత్సవారు విద్యాశాఖ వద్దనుకొంటున్నారు. కానీ అంతమాత్రన్న రాజీనామా చేసే ఉద్దేశ్యం కూడా లేదు. కనుక తనకు మళ్ళీ పురపాలక, పట్టణాభివృద్ధి శాఖలను ఇవ్వాలని సిఎం జగన్మోహన్ రెడ్డిని కోరుతున్నట్లు సమాచారం. అయితే ఆ పదవిని ఇప్పటికే ఆదిమూలపు సురేష్‌కి కట్టబెట్టినందున, అలా చేస్తే ఆయన అలకపాన్పు ఎక్కే ప్రమాదం ఉంది.
అదీగాక ఒకసారి బొత్సవారి కోసం మంత్రి పదవులలో మార్పులు చేసినట్లయితే, అంతా ప్రాధాన్యతలేని పర్యాటకశాఖ పొందిన రోజా వంటివారు కూడా తమకూ శాఖలు మార్చాలని డిమాండ్ చేయవచ్చు. ఇదీగాక… ఎంతో లోతుగా కసరత్తు చేసిన తరువాతే ‘అర్హులను గుర్తించి’ మంత్రి పదవులు కేటాయించామని వైసీపీలో రెండో స్థానానికి ఎదిగిన సజ్జల గొప్పగా చెప్పుకొన్నారు. కనుక ఇప్పుడు బొత్సవారి కోసం మంత్రుల శాఖలు మార్చితే, ప్రతిపక్షాలు ఎద్దేవా చేయకమానవు. ప్రజలకు కూడా మళ్ళీ జగన్ మడమ తిప్పవలసి వచ్చిందనే తప్పుడు సంకేతాలు పంపినట్లవుతుంది.
అపార రాజకీయ అనుభవం ఉన్న బొత్స సత్యనారాయణకి కూడా ఇవ్వన్నీ తెలిసే ఉంటాయి. కనుక మెడకు గుదిబండలా మారిన ఈ విద్యాశాఖను… ఈ మంత్రి పదవిని ఏవిదంగా నిర్వహిస్తారో చూడాలి. ఒకవేళ పదవి వదులుకోదలిస్తే, బిహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్‌లాగా ఆ పదవిని తన భార్యకు ఇమ్మని అడుగుతారేమో?



