
వైసీపీ అధినేత జగన్ తర్వాత రెండో స్థానంలో విజయసాయి రెడ్డి ఉండేవారు. సజ్జల రామకృష్ణ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వంటివారు రెండో స్థానంలో కనిపించినప్పటికీ విజయసాయి రెడ్డి స్థానం చెక్కు చెదరలేదనే చెప్పాలి.
Also Read – జగన్ 2.0 కోసం కార్యకర్తలు జైళ్ళకి వెళ్ళాలా?
విజయసాయి రెడ్డి ఢిల్లీలో కూర్చొని వివిద కేసులకు బ్రేకులు వేయించేవారు. జగన్ ఢిల్లీ వచ్చినప్పుడు ప్రధాని మోడీ, అమిత్ షాల అపాయింట్మెంట్స్ ఇప్పించేవారు. ఇంకా చాలా కార్యక్రమాలు చక్కబెట్టేవారు. కనుక రెండో స్థానంలో ఉన్నా లేకపోయినా వైసీపీలో ఆయన ప్రాధాన్యత తగ్గలేదు.
కానీ జగన్ ఆయనని పక్కన పెట్టడం మొదలుపెట్టడం మొదలు పెట్టిన తర్వాత నుంచే రెండో స్థానంలో కనిపిస్తున్నవారు బాగా హైలైట్ అయ్యారని చెప్పొచ్చు.
Also Read – సజ్జల లేని లోటు కనిపిస్తోందా.. మావయ్యా?
ఇప్పుడు విజయసాయి రెడ్డి పార్టీ, పదవుల నుంచి తప్పుకున్నారు. కనుక ఇప్పుడు మళ్ళీ వైసీపీలో రెండో స్థానం కోసం పోటీ మొదలవుతుంది.
శాసనసభ ఎన్నికలలో వైసీపీ ఓడిపోయిన తర్వాత సజ్జల రామకృష్ణా రెడ్డిని కూడా జగన్ పక్కన పెట్టడంతో ఇప్పుడు వైసీపీలో రెండో స్థానం ఎవరికి?అనే ప్రశ్న తలెత్తుతుంది.
పార్టీలో సీనియర్ నాయకులలో బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వంటివారున్నారు. కానీ వారెవరికీ నిత్యం మీడియా ముందుకు వచ్చి ఏదో ఒకటి మాట్లాడే అలవాటు లేదు. పైగా ఢిల్లీలో చక్రం తిప్పలేరు.
రోజా, అంబటి, గుడివాడ వంటి వారు లొడలొడా ఎంతసేపైనా మాట్లాడగలరు కానీ టీడీపీతో వైసీపీ రాజకీయాలను బ్యాలన్స్ చేయలేరు.
కనుక విజయసాయి రెడ్డి స్థానంలోకి మళ్ళీ సజ్జల రామకృష్ణా రెడ్డిని తీసుకురాక తప్పదేమో? కానీ ఆయన మీడియాతో ఆచితూచి మాట్లాడగలరు. తెర వెనుక ఉంటూ చక్రం తిప్ప గలరు. కానీ ఢిల్లీకి వెళ్ళలేరు. అక్కడ ఏమీ చేయలేరు.
కనుక విజయసాయి రెడ్డి స్థానంలో ఈ పనులన్నీ చక్కబెట్టేందుకు వైసీపీలో ఇద్దరు లేదా ముగ్గురిని నెంబర్:2లుగా ప్రమోట్ చేసుకోవాలేమో?
విజయసాయి రెడ్డి రాజ్యసభ ఎంపీ పదవికి కూడా రాజీనామా చేసినందున ఆ పదవికీ పోటీ ప్రారంభం అయ్యింది. కానీ వైసీపీలో కాదు.. కూటమిలో. ఈ సీటు కోసం మూడు పార్టీల నేతలు పోటీ పడుతున్నారు. రాజ్యసభ సీటు కేంద్రానికే ఎక్కువ అవసరం. కేంద్రం సూచన మేరకే విజయసాయి రెడ్డి తన పదవికి రాజీనామా చేసి కేసుల నుంచి ఉపశమనం హామీని పొందిన్నట్లు గుసగుసలు వినిపిస్తూనే ఉన్నాయి. కనుక ఆయన సీటుని బీజేపి దక్కించుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.