తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్ ఆ తర్వాత ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి తన రాష్ట్రాన్ని శరవేగంగా అన్ని రంగాలలో అభివృద్ధి చేసారు. ఎంతగా అంటే… ప్రతీ ఒక్కరికీ కళ్ళకు కనబడే అంతగా! పరిశ్రమలు, ఐటి కంపెనీలను రప్పించి లక్షలాది ఉద్యోగాలు కల్పించారు.
ఇక హైదరాబాద్ నగరం రూపు రేఖలైతే సమూలంగా మార్చేశారని చెప్పవచ్చు. ఒక ముఖ్యమంత్రి లేదా ప్రభుత్వం తలుచుకొని పట్టుపట్టి పనిచేస్తే ఆ రాష్ట్రం ఏవిదంగా అభివృద్ధి చెందుతుందో తెలుసుకొనేందుకు తెలంగాణ రాష్ట్రాన్ని ఉదాహరణగా చూపవచ్చు.
ఆయన పట్టుదల, చిత్తశుద్ధి, దూరదృష్టి తెలంగాణ ప్రజల అదృష్టమే అని చెప్పాలి. తెలంగాణ అభివృద్ధి విషయంలో కేసీఆర్‌ని ఎవరూ వేలెత్తి చూపలేరు. అలాగని సంక్షేమ పధకాలను కూడా ఆయన విస్మరించలేదు. అత్యద్భుతమైన బతుకమ్మ చీరలు, కేటీఆర్ కిట్స్, బస్తీ దవాఖానాలు, రైతుబంధు, సామాజిక పింఛన్లు వంటి అనేకానేక పధకాలను చాలా విజయవంతంగా అమలుచేస్తున్నారు.
దేశంలో మరే రాష్ట్రం సాహసించలేని విదంగా దళితబంధు పధకంతో ఒక్కో కుటుంబానికి 10 లక్షలు ఆర్ధిక సాయం అందజేస్తున్నారు. తెలంగాణ అభివృద్ధి, సంక్షేమ పధకాలు గురించి ఇలా చెప్పుకొంటూపోతే పెద్ద పుస్తకమే వ్రాయాల్సి వస్తుంది.
అయినా కేసీఆర్ పట్ల తెలంగాణలో క్రమంగా వ్యతిరేకత పెరుగుతూనే ఉంది. అదే ఇప్పుడు ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీకి శాపంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. తెలంగాణను ఇంతగా అభివృద్ధి చేసి, ఇన్ని సంక్షేమ పధకాలు అమలుచేస్తున్నా ఇంకా ఎందుకు వ్యతిరేకత?తెలంగాణ కోసం పరితపించే కేసీఆర్‌ని కాదని ప్రజలు కాంగ్రెస్ వైపు ఎందుకు చూస్తున్నారు?అనే సందేహం కలుగక మానదు. ఇందుకు కొన్ని ప్రధాన కారణాలు కనిపిస్తున్నాయి.
- అన్ని నాకు మాత్రమే తెలుసు. నాకు మాత్రమే తెలంగాణ పట్ల చిత్తశుద్ధి ఉంది. నాకు మాత్రమే దూరదృష్టి ఉంది. మరెవరికీ లేదనే కేసీఆర్ అహంభావం.
- కేసీఆర్ నియంతృత్వ పోకడలు. ప్రతిపక్షాలను నిర్వీర్యం చేయాలని ప్రయత్నిస్తుండటం.
- అభివృద్ధి పేరుతో రైతుల భూములను గుంజుకొంటుండటం. ఉదాహరణకు పలు ప్రాజెక్టుల కోసం, అవుటర్ రింగ్ రోడ్, యాదాద్రి నిర్మాణం కోసం వేలాదిమంది రైతులు భూములు కోల్పోయారు. వారికి కేసీఆర్ న్యాయం చేయలేదు.
- ప్రభుత్వోద్యోగాల భర్తీని కూడా బిఆర్ఎస్ ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం ఉపయోగించుకొంటూ ఎన్నికల వరకు సాగదీస్తుండటంతో నిరుద్యోగులు తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. ముఖ్యంగా టిఎస్‌పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజితో లక్షలాది మంది నిరుద్యోగులు నష్టపోయారు.
- రాష్ట్రాభివృద్ధి పనులతో నిరుపేద రైతులు నిర్వాసితులుగా మారి రోడ్డున పడుతుంటే, అదే అభివృద్ధి పనులతో కేసీఆర్ కుటుంబం అత్యంత ధనవంతులుగా మారడం.
- ఆ డబ్బుతో రాష్ట్ర, దేశ రాజకీయాలను శాశించాలని ప్రయత్నిస్తుండటం ద్వారా ప్రతిపక్షాల అవినీతి ఆరోపణలను స్వయంగా ధృవీకరించిన్నట్లయింది.
- పదేళ్ళ పాలన తర్వాత సహజంగానే ప్రజలలో ఏర్పడే ప్రభుత్వ వ్యతిరేకత.
ఇటువంటి పలు కారణాల వలన తెలంగాణలో ప్రజలు, ప్రతిపక్షాలు, మేధావులు కేసీఆర్‌ని వ్యతిరేకిస్తున్నారు. దీనినే కాంగ్రెస్, బీజేపీలు తమకు అనుకూలంగా మలుచుకొని ఎన్నికలలో విజయం సాధించాలని ప్రయత్నిస్తున్నాయి.






