వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి నేటికీ తాడేపల్లి ప్యాలస్‌లో నుంచి బయటకు రాకపోయినా ఆయన పిలుపు మేరకు వైసీపీ నేతలు, కార్యకర్తలు అందరూ తుఫాను ప్రభావిత ప్రాంతాలకు వెళ్ళి యధాశక్తిన సాయపడుతున్నారు.
గతంలో టీడీపి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడుతో సహా ప్రతీ ఒక్కరూ ఇలాగే బాధిత కుటుంబాలను పరామర్శించి ఆదుకునేవారు. కనుక టీడీపిని దాని అధినేత చంద్రబాబు నాయుడుని అమితంగా ద్వేషించే జగన్, ఈ ఒక్క విషయంలో టీడీపిని ఫాలో అవడం చాలా అభినందనీయమే.
కానీ జగన్ కూడా చంద్రబాబు నాయుడులా తుఫాను ప్రభావిత ప్రాంతాలకు వెళ్ళి ప్రజలకు ధైర్యం చెప్పి ఉంటే ‘వ్రత ఫలితం’ పూర్తిగా వైసీపీకి దక్కి ఉండేది.
కానీ అలవాటు ప్రకారం నాడు తమ హయంలో కట్టించిన సచివాయాలు, నాడు-నేడు కార్యక్రమంలో భాగంగా తాము బాగు చేసిన పాఠశాలలే ఇప్పుడు తుఫాను బాధితులకు పునరావాస కేంద్రాలుగా ఉపయోగపడుతున్నాయని సోషల్ మీడియాలో వైసీపీ గొప్పగా చెప్పుకుంది.
రాష్ట్ర విభజన తర్వాత ఏపీకి రాజధాని, పాలన కోసం కార్యాలయాలు లేవని హైదరాబాద్‌లోనే 10 ఏళ్ళు ఉండిపోలేదు కదా?విజయవాడ, గుంటూరు నగరాలలో తాత్కాలిక ఏర్పాట్లు చేసుకొని సిఎం చంద్రబాబు నాయుడు పాలన సాగించారు కదా?
కనుక నా కోడి కూయకపోతే లోకానికి తెల్లారదనుకున్నట్లు మేము సచివాలయాలు కట్టించకపోతే తుఫాను బాధితులు ఎక్కడ ఉంటారనుకోవడం చాలా హాస్యాస్పదంగా ఉంది.
సోషల్ మీడియాలో కుప్పలు తెప్పలుగా పడుతున్న వైసీపీ నేతల ఫోటోలు చూస్తుంటే వాటి కోసమే వారు బాధితుల వద్దకు వెళుతున్నారా? అనే సందేహం కలుగుతుంది. కనుక వారు మొంథా తుఫాను బాధితులను ఆదుకోవడంపై ఎక్కువ దృష్టి పెట్టాలి కానీ వారితో ఫోటోలు దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేసుకోవడంపై కాదు.
పార్టీ నేతలు, కార్యకర్తలు తుఫాను బాధిత ప్రజల మద్య ఉన్నప్పుడు, జగన్ తాడేపల్లి ప్యాలస్‌లో ఉండిపోతే ఏమనుకోవాలి?
బహుశః తుఫాను ముగిసిన తర్వాత దాంతో తీవ్రంగా నష్టపోయిన ప్రజలు మరింత బాధపడుతుంటారు కనుక అప్పుడు వెళ్ళి పరామర్శిస్తే ఎక్కువ మైలేజ్ లభిస్తుందని అనుకుంటున్నారేమో?చేసే పనిలో నిబద్దత ఉండాలి. ఉంటే ప్రజలే మెచ్చుకుంటారు. అది లేనప్పుడు మైలేజ్ కూడా రాదు.







