Why No Action on Corrupt Political Leaders?

ఏపీలో వైసీపీ, తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీల నేతలు అనేక అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారని కాంగ్రెస్‌, టీడీపీలు ఆరోపిస్తున్నాయి. ఏపీలో పలువురు వైసీపీ నేతలపై కేసులు నమోదు చేసినప్పటికీ వారందరూ ఇలా లోపలకు వెళ్ళి అలా బయటకు వచ్చేస్తున్నారు. దీంతో ఇదో మొక్కుబడి కార్యక్రమంగా మారిపోయింది.

Also Read – అమరావతిలో బసవతారకం….

తెలంగాణ ప్రభుత్వం కూడా కేసులు నమోదు చేయిస్తోంది. కానీ సిఎం రేవంత్ రెడ్డి తొందరపడటం లేదు. రెండు కమీషన్లు వేసి కాళేశ్వరం ప్రాజెక్టు, విద్యుత్ ప్రాజెక్టులలో జరిగిన అవినీతి అక్రమాలపై విచారణ జరిపిస్తున్నారు.

ఫోన్ ట్యాపింగ్, ఫార్ములా 1 రేసింగ్ వ్యవహారం కేసుల విచారణ కూడా జరుగుతోంది. ఈ నాలుగు కేసులలో ప్రధాన సూత్రధారులు కేసీఆర్‌, కేటీఆర్‌, హరీష్ రావు ఉండటం గమనిస్తే వారిని బందించేందుకు రేవంత్ రెడ్డి పకడ్బందీగా వల సిద్దం చేస్తున్నారని అర్దమవుతుంది.

Also Read – రాహుల్ “లీగల్లీ కన్వెర్టడ్ ఇండియన్”.?

ఎఫ్-1 రేసింగ్ కేసులో ఏ-1 నిందితుడుగా ఉన్న కేటీఆర్‌పై ఏసీబీ, ఈడీలు వేర్వేరుగా కేసులు నమోదు చేసి ప్రశ్నించాయి కూడా. ఈ కేసులో సుప్రీంకోర్టు కూడా జోక్యం చేసుకోలేమని చెప్పేసింది.

కనుక ఏ క్షణంలోనైనా కేటీఆర్‌ని అరెస్ట్‌ చేయవచ్చని వార్తలు వచ్చాయి. రేవంత్ రెడ్డి, మంత్రులు కూడా కేటీఆర్‌ అరెస్ట్‌ తధ్యం అని పదేపదే చెప్పారు. కానీ ఇంతవరకు అరెస్ట్‌ చేయలేదు.

Also Read – అయ్యో ‘నానీ’లు ఇలా అయిపోయారే..!

అత్యంత తీవ్రమైన నేరంగా పరిగణించబడే ‘ఫోన్ ట్యాపింగ్’ కేసు కూడా మెల్లగా ఆటకెక్కిపోయిన్నట్లే కనిపిస్తోంది. కనుక కాళేశ్వరం, విద్యుత్ ప్రాజెక్టులపై రెండు కమీషన్లు నివేదికలు ఇస్తే, వాటిని కూడా రేవంత్ రెడ్డి భద్రంగా లాకర్‌లో పెట్టేసినా ఆశ్చర్యం లేదు.

అన్ని సాక్ష్యాధారాలు చేతిలో ఉన్నా కేసీఆర్‌, కేటీఆర్‌, హరీష్ రావులని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎందుకు టచ్ చేయలేకపోతోంది?

టచ్ చేస్తే జీహెచ్ఎంసీ, స్థానిక సంస్థల ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీకి సానుభూతి ఓట్లు పడతాయనా? కాంగ్రెస్ అధిష్టానం లేదా ప్రధాని మోడీ అనుమతించకపోవడం వలననా?లేదా ఈ కేసులతో వారిని అరెస్ట్‌ చేసినప్పుడు కాంగ్రెస్ పార్టీకే ఎక్కువ రాజకీయ మైలేజ్ లభించాలనా?అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.

తెలంగాణాలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం కనీసం ఇంత దూరం వెళ్ళగలిగింది. కానీ ఏపీలో కూటమి ప్రభుత్వం వైసీపీ నేతల విషయం ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేకపోయిందనే చెప్పాలి.

తిరుమల కల్తీ నెయ్యి కేసు, మాధనపల్లి ఫైల్స్ దగ్ధం కేసు, పేర్ని నాని గోదాములలో రేషన్ బియ్యం మాయం కేసు, కాకినాడ పోర్టు నుంచి బియ్యం అక్రమ రవాణా కేసుల గురించి ఇప్పుడు కూటమిలో ఏ ఒక్కరూ మాట్లాడటం లేదు. బహుశః అవన్నీ ఆటకెక్కిపోయి ఉండొచ్చు.

అందుకే వైసీపీ నేతలు, వారి సోషల్ మీడియా మళ్ళీ ఇంతగా రెచ్చిపోతూ సిఎం చంద్రబాబు నాయుడుని ఉద్దేశయించి ఇంత అవహేళనగా మాట్లాడగలుగుతున్నారు.

తెలంగాణలో కేసీఆర్‌, కేటీఆర్‌, హరీష్ రావులపై చర్యలు తీసుకోవడానికి రేవంత్ రెడ్డి ఏ కారణాల చేత వెనకాడుతున్నారో, ఏపీలో కూడా ఇంచుమించు అవే కారణాల వల్ల కూటమి ప్రభుత్వం జగన్‌, వైసీపీ నేతల జోలికి వెళ్ళడం లేదనుకోవచ్చు.

చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి ఏ కారణాల చేత అవినీతి, అక్రమాలకు పాల్పడిన వారిని ఉపేక్షిస్తున్నప్పటికీ, అది వారి రాజకీయ బాలహీనతగానే కనిపిస్తోంది. వైసీపీ, బిఆర్ఎస్ నేతలను ఎవరూ టచ్ చేయలేరని ప్రభుత్వాలే అంగీకరిస్తున్నట్లుంది.

సామాన్యులపై చర్యలు తీసుకోవడానికి, వారిపై ప్రతాపం చూపడానికి క్షణం ఆలస్యం చేయని ప్రభుత్వాలు, ఇటువంటి రాజకీయ ప్రతిబంధకాల కారణంగా అవినీతికి పాల్పడిన రాజకీయ నాయకులపై చర్యలు తీసుకోలేపోతున్నాయి. వాటి నిసహాయతని చూసి సామాన్య ప్రజలకు అసంతృప్తి, అసహనం కలగదా?