రాష్ట్ర రాజధాని అంటే మాజీ ముఖ్యమంత్రి వైస్ జగన్ ఎన్నికల సమయంలో పార్టీ అభ్యర్థుల నియోజకవర్గాల మార్పు అనుకుంటున్నారో ఏమో కానీ, అప్పుడు తన పార్టీ ఎమ్మెల్యే ను ఎంపీ లను ఇక్కడి వారిని అక్కడకు, అక్కడ వారిని ఇక్కడకు మార్చినట్టు నిత్యం ఆంధ్రప్రదేశ్ రాజధానిని ఇక్కడి నుంచి అక్కడికి అక్కడి నుంచి మరొక చోటకి అంటూ ఎప్పుడు ఎదో ఒక డైవెర్షన్ రాజకీయ ప్రకటనలు చేస్తున్నారు.
* 2019 ఎన్నికల ముందు వరకు నా ఇల్లు ఇక్కడే నా రాష్ట్ర రాజధాని ఇక్కడే అంటూ నాటి టీడీపీ ప్రభుత్వం ప్రకటించిన రాజధాని అమరావతికి అసెంబ్లీ సాక్షిగా సంపూర్ణ మద్దతు ప్రకటించారు జగన్.
* ఇక 2019 ఎన్నికల తరువాత వైసీపీ అధికారంలోకి రావడంతో మూడు రాజధానులు అంటూ దక్షిణాఫ్రికా విధానాల పై మనసుపారేసుకుని అమరావతి శాసన రాజధాని, విశాఖ ఎగ్జిక్యూటివ్ రాజధాని, కర్నూల్ న్యాయ రాజధాని అంటూ ఐదేళ్లు మాటలతో మాయ చేసారు.
* ఇక ఆ తరువాత హైద్రాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉన్నంతకాలం ఏపీకి మరో రాజధాని అవసరం లేదు, ఏపీకి ప్రస్తుతానికి హైదరాబాదే రాజధాని అంటూ మరి కొన్నాళ్ళు నెట్టుకెళ్ళారు.
* 2024 ఎన్నికలకు ఏడాది ముందు విశాఖే ఏకైక రాజధాని అంటూ ఈ సంక్రాంతికి, ఆ ఉగాదికి, వచ్చే దసరాకు అంటూ పండగల పేరుతో పబ్బం గడుపుకున్నారే కానీ 500 కోట్లు ఖర్చు పెట్టి ఆశగా, ఆర్భాటంగా నిర్మించుకున్న రుషికొండ ప్యాలస్ మీదకు ముఖ్యమంత్రిగా అడుగు కూడా వేయలేకపోయారు జగన్ మోహన్ రెడ్డి.
* ఇక 2024 ఎన్నికల తరువాత వైసీపీ ఘోర ఓటమితో కంగుతిన్న జగన్ ఇప్పటి వరకు ఏపీ రాజధాని పై ఎటువంటి ప్రకటన చేయలేదు. ఇక కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో అమరావతికి రాజధానిగా తిరిగి జీవం పోస్తున్నారు ముఖ్యమంత్రి బాబు.
* ఇటువంటి సమయంలో 2025 మే 22 నేడు మీడియా ముందుకొచ్చిన జగన్ రాజధాని పై అనూహ్యంగా మరో ప్రాంతాన్ని ప్రతిపాదించారు. దీనితో ఇప్పటికి జగన్ ఏపీకి నాల్గవ రాజధానిని ప్రకటించినట్లయ్యింది.
వేల కోట్లు ఖర్చు చేసి, అప్పులు తెచ్చి అమరావతిని నిర్మించే బదులుగా విజయవాడ – గుంటూరు మధ్యలో నాగార్జున యూనివర్సిటీ సమీపంలో ఎక్కడొక్కడ సుమారు ఒక 500 ఎకరాల భూమి సేకరించి మీరు అనుకున్న భవనాలను నిర్మించి రాజధానిని ఏర్పాటు చేయండి అంటూ జగన్ బాబుకు మరో ఉచిత సలహా ఇచ్చేసారు.
ఇలా ఏడాదికో ప్రాంతం పేరు చెప్పి, మాటలతో మభ్య పెట్టి ఏపీ ని మరోమారు ప్రాంతాల మాదిరి విభజనలు చెయ్యాలని జగన్ భావిస్తున్నారా.? ఇప్పటికే విశాఖ, కర్నూల్ అంటూ ఆ రెండు ప్రాంతాల ప్రజల చీత్కారాన్ని ఎదుర్కున్న జగన్ ఇప్పుడు విజయవాడ – గుంటూరు అంటూ అమరావతి పై మరోసారి విషం చిమ్మే ప్రయత్నం చేస్తున్నారు. జగన్ తీరు చూస్తుంటే
గత వైసీపీ ఎన్నికల ప్రచారమైన వై నాట్ 175….రాజధానుల విషయంలో కూడా అమలు చేసేలా కనిపిస్తున్నారు జగన్. ఎలాగూ మాటలతో కాలక్షేపం చేయడమే తప్ప నిర్మాణాలు చేసే అలవాటు లేని వైసీపీ రాజధాని పై రాద్ధాంతం చేయడమే ఆ పార్టీ ముఖ్య సిద్ధాంతంగా మారిపోయినట్టు ఉంది.




