మాజీ ఎమ్మెల్యే, పార్టీలో సీనియర్ నాయకుడైన వల్లభనేని వంశీని అరెస్ట్ చేస్తే పెద్దగా స్పందించని వైసీపీ నేతలు నటుడు పోసాని కృష్ణ మురళి విషయంలో వైసీపీ నేతలు చేస్తున్న హడావుడి, వాదనలు చాలా ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. అనుమానాలు రేకెత్తిస్తున్నాయి.
పోసాని తరపున వైసీపీ ఆస్థాన న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదించడానికి రావడం పెద్ద వింతేమీ కాదు. కానీ తాను తప్పు చేశానని పోసాని స్వయంగా ఒప్పుకుంటుంటే, ఆయన తప్పు చేయలేదని, ఆయన అరెస్ట్ అక్రమమని పొన్నవోలుతో సహా వైసీపీ నేతలందరూ వాదిస్తుందటమే చాలా విచిత్రంగా అనిపిస్తుంది.
తాను సజ్జల రామకృష్ణా రెడ్డి వ్రాసిచ్చిన స్క్రిప్ట్ ప్రకారమే మాట్లాడానని పోసాని పోలీసులకు చెప్పారు. కనుక ఆయన ఇంకా పోలీస్ కస్టడీలో ఉంటే మరెంతమంది ముఖ్య నేతల పేర్లు బయటపెడతారో అని వైసీపీ నేతలు ఆందోళన చెందుతున్నారా?అందుకే వంశీకి ఈయని ప్రాధాన్యత పోసానికి ఇస్తున్నారా?అనే అనుమానం కలుగుతోంది.
పొన్నవోలు సుధాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, “పోసానిపై ఒకటీ రెండు కాదు ఏకంగా 14 కేసులు నమోదయ్యాయి. కనుక ఈ కేసులో ఆయనకు బెయిల్ ఇప్పించి బయటకు తెచ్చినా, మరో కేసులో పోలీసులు వచ్చి ఆయనని గడ్డలా తన్నుకు పోయి లోపల వేస్తారు. మేము అక్కడకు పరుగెత్తుకు వెళ్ళి బెయిల్ తెచ్చేసరికి మరో కేసులో పట్టుకుపోతారు.
ఆయనపై రాష్ట్రంలో ఏ స్టేషన్లో ఏ కేసు వేశారో, ఆయనని ఏ కోర్టులో హాజరుపరుస్తున్నారో తెలుసుకోవడమే పెద్ద కష్టంగా మారింది. కనుక కొన్ని నెలలపాటు పోసానిని జైల్లో ఉంచేందుకు కూటమి ప్రభుత్వం పక్కా ప్రణాళికతో కేసులు సిద్దం చేసి ఉంచిందని భావిస్తున్నాను. కూటమి ప్రభుత్వం పోలీస్ వ్యవస్థని పూర్తిగా భ్రష్టు పట్టించేస్తోందంటూ” ఇంకా చాలా మాట్లాడారు.
పొన్నవోలు చెప్పింది నిజమే కానీ ఇది పోసాని ఒక్కరికే పరిమితం కాదు వైసీపీలో ఇంకా చాలా మందిపై చాలా కేసులున్నాయి. వాటిని బయటకు తీస్తే పొన్నవోలు హెలికాఫ్టర్ వేసుకొని తిరిగినా అన్నీ వాదించలేరు. అలాగే అందరిపై ఒకేసారి కేసులు నమోదు చేస్తే ప్రస్తుతం ఉన్న పోలీస్ స్టేషన్లు, కోర్టులు కూడా సరిపోవు. కనుక వైసీపీలో మిగిలినవారు తమ నంబర్ వచ్చే వరకు ఎదురుచూడక తప్పదు.




