మేకపాటి గౌతమ్ రెడ్డి అకాల మరణం కారణంగా నేడు జరగాల్సిన “భీమ్లా నాయక్” ప్రీ రిలీజ్ ఈవెంట్ ను క్యాన్సిల్ చేసినట్లుగా పవన్ కళ్యాణ్ ప్రకటించారు. అయితే ట్రైలర్ మాత్రం చెప్పిన సమయానికి, అంటే ఈ రోజు సాయంత్రం 8.10 నిముషాలకు విడుదల అవుతుండడం ఫ్యాన్స్ కు ఊపునిచ్చే విషయం.
ఈ ట్రైలర్ కు వచ్చిన స్పందన బట్టే సినిమాపై బజ్ ఏర్పడుతుంది గనుక, ‘భీమ్లా నాయక్’పై భారీ అంచనాలు ఏర్పడాలంటే ట్రైలర్ కట్ పర్ ఫెక్ట్ గా ఉండాలి. దీంతో ప్రస్తుతం అందరి చూపులు మరికొద్ది గంటల్లో విడుదల కాబోతున్న ట్రైలర్ పై పడనున్నాయి.
ట్రైలర్ సంగతులు అలా ఉంచితే, ‘భీమ్లా నాయక్’ ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఉంటుందా? లేదా? అన్న సందేహాలు అభిమానుల్లో నెలకొంటున్నాయి. ఎందుకంటే నేటి తేదీ 21, సినిమా విడుదల కాబోతున్న తేదీ 25. ఇవాళ ఎలాగూ జరగబోవడం లేదు గనుక ఇంకా నడుమ ఉన్నది మూడు రోజులు మాత్రమే.
ఖచ్చితంగా రిలీజ్ కు ఒక్క రోజు ముందు అయితే ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉండబోదు. ఎందుకంటే యుఎస్ ప్రీమియర్ షోల ప్రదర్శనకు కొద్దీ గంటల సమయం మాత్రమే ఉంటుంది గనుక 24వ తేదీన ప్రీ రిలీజ్ ఈవెంట్ అనేది ‘అవుట్ ఆఫ్ సిలబస్’ అని ఖచ్చితంగా చెప్పవచ్చు.
ఇక మిగిలిన రెండు రోజులు మంగళవారం, బుధవారాలలో మాత్రమే ‘భీమ్లా’ ఈవెంట్ కు అవకాశం ఉంది. నేడు జరిగిన విషాదం నుండి బయటకు రావాలంటే కనీసం మరో రోజైనా పడుతుంది గనుక, రేపు ‘భీమ్లా’ ఈవెంట్ జరిగే అవకాశాలు అతి తక్కువే.
దీంతో అందరి చూపులు ఒక్క బుధవారం వైపుకే వెళ్తున్నాయి. సినీ వర్గాలు కూడా 23వ తేదీన ఈ సినిమా వేడుక జరుగుతుందని సమాచారం ఇస్తున్నాయి. హైదరాబాద్ లోని యూసుఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్ లో ‘భీమ్లా నాయక్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ప్లాన్ చేసిన విషయం తెలిసిందే.
ఇదిలా ఉంటే ఈ ఈవెంట్ కు తనకు ఆహ్వానం అందకపోవడంపై ప్రముఖ నిర్మాత, పవన్ అభిమాని అయిన బండ్ల గణేష్ ‘మాటల మాంత్రికుడు’ త్రివిక్రమ్ శ్రీనివాస్ ను ఉద్దేశించి అసభ్య పదజాలాన్ని వినియోగించిన ఆడియో టేప్ లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.



