ఏపీ శాసనసభ ఎన్నికలు, ఏపీ తెలంగాణ రాష్ట్రాలలో లోక్‌సభ ఎన్నికలు మే 13న ఒకే రోజు జరుగబోతున్నాయి. దీంతో బిఆర్ఎస్ పార్టీ నష్టపోయే సూచనలు కనిపిస్తున్నాయి.
గత డిసెంబర్‌లో తెలంగాణ శాసనసభ ఎన్నికలు జరిగినప్పుడు ఏపీలో ఎటువంటి ఎన్నికలు లేనందున గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో స్థిరపడిన ఆంధ్రా ప్రజలు అక్కడే ఉండి బిఆర్ఎస్ పార్టీకి ఓట్లు వేయగా, తెలంగాణ ప్రజలు తమ తమ జిల్లాలకు వెళ్ళి ఓట్లు వేశారు.
దీంతో గ్రేటర్ పరిధిలో బిఆర్ఎస్ పార్టీ, రాష్ట్రంలో ఇతర జిల్లాలలో కాంగ్రెస్ పార్టీ ఎక్కువ సీట్లు గెలుచుకున్నాయి.
అయితే ఏపీ శాసనసభ ఎన్నికల ఫలితాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్‌పై తీవ్ర ప్రభావం చూపబోతున్నందున గ్రేటర్ పరిధిలో స్థిరపడిన ఆంధ్ర ప్రజలు ఈసారి తమ ఓటు హక్కుని ఏపీలో ఉపయోగించుకునేందుకే మొగ్గు చూపుతున్నారు.
ఇప్పటికే హైదరాబాద్ నుంచి ఏపీకి వచ్చే రైళ్ళు, బస్సులు వారితో కిటకిటలాడుతున్నాయి. హైదరాబాద్‌లోని సెటిలర్స్ పోలింగ్ జరిగే మే 13లోగా ఏపీకి చేరుకునేందుకు రైళ్ళు, బస్సులు, విమానాలలో టికెట్స్ ముందే బుక్ చేసేసుకున్నారు.
ఇక గ్రేటర్ పరిధిలో స్థిరపడిన తెలంగాణవాసులు ఎప్పటిలాగే లోక్‌సభ ఎన్నికలలో తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు తమ జిల్లాలకు బయలుదేరి వెళ్ళిపోతారు. కనుక ఈసారి వారి ఓట్లు కూడా బిఆర్ఎస్ పార్టీ చేజారిపోయిన్నట్లే. ఈ ప్రభావం సికింద్రాబాద్, చేవెళ్ళ, మల్కాజ్‌గిరి పార్లమెంట్ నియోజకవర్గాలపై పడుతుంది.
శాసనసభ ఎన్నికలలో ఎదురైన చేదు అనుభవంతో మేల్కొన్న కాంగ్రెస్ పార్టీ, ఈ నాలుగు నెలల్లో గ్రేటర్ పరిధిలో పార్టీని చాలా బలోపేతం చేసుకుంది. ఈ మూడు నియోజకవర్గాలలో కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే మంచి పట్టు సాధించింది.
బీజేపీ ఎప్పటిలాగే హిందూ ఓటు బ్యాంకుపై, మజ్లీస్ పార్టీ ముస్లిం ఓటు బ్యాంకుపై పూర్తి నమ్మకంతో ఉన్నాయి. ఏపీ శాసనసభ ఎన్నికలు కాంగ్రెస్, బీజేపీలకు కలిసి వస్తుంటే, బిఆర్ఎస్ పార్టీకి మాత్రం ఎంకి పెళ్ళి సుబ్బి చావుకి వచ్చిన్నట్లు నష్టం కలిగించేలా ఉన్నాయి.




