త్వరలో తెలంగాణ శాసనసభ ఎన్నికలు జరుగబోతున్నందున ప్రధాని నరేంద్రమోడీ అక్టోబర్ 2న తెలంగాణలో పర్యటించబోతున్నారు. ఆరోజు మహబూబ్ నగర్‌లో ఎన్నికల ప్రచార సభలో పాల్గొంటారు. ఎన్నికలలోగా ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా, కేంద్రమంత్రులు తరచూ తెలంగాణలో పర్యటించడం తధ్యమే.
ఆ తర్వాత ఏపీ శాసనసభ, లోక్‌సభ ఎన్నికల ప్రచారం కోసం ఆంధ్రాలో కూడా పర్యటించవలసి ఉంటుంది. ప్రత్యేకహోదా, విశాఖ రైల్వేజోన్ ఏర్పాటు వంటి విభజన హామీలు అమలుచేయకపోయినా, ఇదివరకు వారు ఎప్పుడు రాష్ట్రానికి వచ్చినా ఆంధ్రా ప్రజలు వ్యతిరేకించలేదు.
కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి న్యాయం చేయకపోగా, ప్రజాభిప్రాయాన్ని మన్నించకుండా వైజాగ్ స్టీల్ ప్లాంట్‌ని అమ్మేస్తోంది. ప్రధాని మోడీ స్వయంగా భూమి పూజ చేసిన అమరావతిని జగన్ ప్రభుత్వం పాడుపెడుతున్నా పట్టించుకోలేదు.
నాలుగున్నరేళ్ళుగా పోలవరం ప్రాజెక్ట్ నత్తనడకలు నడుస్తున్నా పట్టించుకోలేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోతోందని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి స్వయంగా చెపుతున్నారు. అయినా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదు.
అయినప్పటికీ ఆంధ్రా ప్రజలు చాలా సహనంగానే ఎదురుచూస్తూ వారిని గౌరవిస్తూనే ఉన్నారు. కానీ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని జగన్ ప్రభుత్వం అరెస్ట్ చేసి జైల్లో పెట్టి వేధిస్తున్నప్పటికీ మోడీ, అమిత్ షాలు మౌనం వహిస్తుండటం పట్ల ఆంధ్రా ప్రజలు తీవ్ర అసంతృప్తిగా, ఆగ్రహంగా ఉన్నారు.
టిడిపితో కలిసి ఎన్నికలలో పోటీ చేస్తామని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రకటించి దాదాపు మూడు వారాలవుతున్నా ఇంతవరకు బీజేపీ అధిష్టానం ఆయనను ఢిల్లీకి ఆహ్వానించి మాట్లాడలేదు. కనీసం స్పందించలేదు!
బీజేపీ అధిష్టానం ఈ ధోరణిపట్ల జనసేన తీవ్ర అసహనంతో ఉండగా, ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి అటు తమ అధిష్టానాన్ని సమర్ధించుకోలేక, ఇటు జనసేనకు, ప్రజలకు జవాబు చెప్పుకోలేక సతమతమవుతుండటం అందరూ చూస్తూనే ఉన్నారు.
ఈ నేపధ్యంలో మోడీ, అమిత్ షాలు అసలేమీ జరగన్నట్లుగా ఇదివరకులా ఆంధ్రాలో పర్యటించగలరా?పర్యటిస్తే చంద్రబాబు నాయుడు అరెస్ట్ విషయంలో రాష్ట్ర ప్రజలకు ఏమని సమాధానం చెప్పుకొంటారు?ఒకవేళ చెప్పుకొన్నా ఆంధ్రా ప్రజలు వారిని ఆదరించి గౌరవిస్తారా?చంద్రబాబు నాయుడు విడుదల, ఈ రాజకీయ వేధింపులు, జనసేనతో పొత్తుల సంగతి తేల్చుకోకుండా బహుశః మోడీ, అమిత్ షాలు ఆంధ్రాలో అడుగుపెట్టే ఆలోచన చేయడం కూడా కష్టమే.



