ఒకప్పడు మంచి మిత్రులుగా ఉన్న మెగాస్టార్ చిరంజీవి, ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాథ్ వర్గాలకు ప్రస్తుతం ఏ మాత్రం పడటం లేదు. రామ్ చరణ్ పై యండమూరి తీవ్ర వ్యాఖ్యలు చేయడం… యండమూరిపై నాగబాబు మండిపడటం… ఇదంతా ముగిసిపోయిన కధ. తాజాగా చిరంజీవి హోస్ట్ గా వ్యవహరిస్తున్న ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ టీవీ ప్రోగ్రాంను టార్గెట్ చేసుకుని యండమూరి వీరేంద్రనాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ అనే కార్యక్రమం అతి పెద్ద మోసం అని యండమూరి తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ పోటీలో పాల్గొనాలంటే ముందుగా మూడు మెసేజ్ లు పంపాల్సి ఉంటుందని… ఒక్కో మెసేజ్ కు 5 రూపాయలు కట్ అవుతుందని చెప్పారు. అంటే ఒక్కొక్కరు 15 రూపాయలు చెల్లించుకుంటారని… ఈ రకంగా 10 లక్షల మంది మెసేజ్ లు పంపితే, నిర్వాహకులు జేబులోకి 1.5 కోట్లు వెళతాయని, ఆ తర్వాత పోటీలో పాల్గొనే వారికి కుక్క బిస్కెట్లు వేసినట్టు ఐదు, ఆరు లక్షలు విసురుతారని మండిపడ్డారు.
ఆ కుక్క బిస్కెట్లను మనం చొంగ కార్చుకుంటూ తీసుకుంటున్నామని, నిరుపేదలు సైతం ఎంతో ఆశతో ఈ కార్యక్రమానికి మెసేజ్ లు పంపుతున్నారని యండమూరి ఆవేదన వ్యక్తం చేశారు. ఇంతకంటే మోసం మరొక్కటి లేదని… దీని కంటే లాటరీ టికెట్ కొనుక్కోవడం చాలా మేలని సూచించారు. లాటరీలను బ్యాన్ చేసినట్టే… ఇలాంటి కార్యక్రమాలను కూడా ప్రభుత్వాలు నిషేధించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. అయితే ఈ విమర్శలు కేవలం కార్యక్రమం చేసుకుని చేసిందా? లేక చిరును ఉద్దేశించి చేసిందా? అన్నది ఆసక్తికరంగా సాగింది.
ఈ విమర్శలలో ఎక్కడా చిరు పేరు ప్రస్తావించలేదు గానీ, ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ కార్యక్రమం అనేది తెలుగు ప్రేక్షకులకు కొత్తేమీ కాదన్న విషయం తెలిసిందే. గతంలో నాగార్జున హోస్ట్ గా మూడు సీజన్లు గడిచిపోగా, అప్పటివరకు విమర్శ చేయని యండమూరి, తాజాగా చిరు టర్న్ వచ్చేపాటికి సదరు కార్యక్రమంపై అభ్యంతరం వ్యక్తం చేయడంతో, తీవ్ర ప్రాధాన్యతను సంతరించుకుంది. మరి ఈ వ్యాఖ్యలకు మెగా కాంపౌండ్ కౌంటర్ వస్తుందో లేదో చూడాలి.



