‘ప్రస్తుతం టీవీ ఛానెల్స్ లో ఇంకొకడి కష్టాలు చూసి ఆనందించడం చాలా శాడిజంగా మారిందని’ ప్రముఖ రచయిత, మానసిక వికాస నిపుణుడు యండమూరి వీరేంద్రనాథ్ అన్నారు. తాజాగా ఓ టీవీ ఛానల్ నిర్వహించిన డిబేట్ లో పాల్గొన్న యండమూరి…. అసలు ఈ కలహాల కాపురాలను కలపడం కోసం టీవీల్లో నిర్వహించే షోల్లో ఎంతవరకు వాస్తవం ఉందనేది ప్రశ్నార్ధకమేనని అన్నారు. తనకున్న అనుభవం మేరకు మానసికంగా ఆనందంగా ఉండే వాళ్లెవ్వరూ ఇలాంటి షోలు చూడరని అన్నారు.
టీవీ ఛానెల్స్ కు ఏమాత్రం ఇంగితజ్ఞానం ఉన్నా ఇలాంటి టీవీ షోలను బ్రాడ్ కాస్ట్ చేయద్దని సూచిస్తున్నానని, ప్రేక్షకులు కూడా ఇటువంటి ప్రోగ్రామ్ లను చూడకుండా ఉంటే ట్యామ్ రేటింగ్స్ తగ్గుతాయని అభిప్రాయపడ్డారు. ఈ తరహా షోలలో పాల్గొనే వారికి కూడా తాము తప్పు చేస్తున్నామనే ఫీలింగ్ కూడా ఉండదని పాపులారిటీ కోసం చేస్తుంటారని అన్నారు. ఆయా టీవీ షోలలో తీర్పులిచ్చే వాళ్లు తనకు తెలుసని, వారిని చూస్తూనే ఉంటానని, వాళ్లకు వాళ్లు మేధావులుగా భావించుకుంటూ ఉంటారని విమర్శించారు.
ఆయా షోలలో తీర్పులిచ్చే వాళ్ల జీవిత రహస్యాలన్నీ తనకు తెలుసని, ఎందుకంటే, హైదరాబాద్ లోని సైకాలజిస్ట్ లందరూ తనకు స్నేహితులేనని, వారి వద్దకు వీళ్లందరూ వస్తుంటారని చెప్పారు. టీవీ షోలలో తీర్పు ఇచ్చే స్థానంలో ఓ కుక్కను కూర్చోపెట్టినా… అది తీర్పిచ్చేస్తూ ఉంటుంది, ఈ తరహా టీవీ షోల గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ‘శవం మీద డబ్బులు ఏరుకోవడమే’ అని యండమూరి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి షోలలో కొన్నాళ్ళ పాటు పాల్గొన్న జీవిత రాజశేఖర్ కూడా ఈ డిబేట్ లో పాల్గొన్నారు.



