యార్లగడ్డ… అప్పుడే అంత దూకుడా?మంచిది కాదు

Yarlagadda-Venkat-Rao-Gannavaram TDPవైసీపీకి గుడ్ బై చెప్పేసి రెండు రోజుల క్రితమే టిడిపిలో చేరిన యార్లగడ్డ వెంకటరావుకి తెలుగు రాష్ట్రాల రాజకీయాల గురించి మంచి అవగాహన ఉంది. ముఖ్యంగా టిడిపి, వైసీపీల గురించి పూర్తి అవగాహన ఉంది. అయితే నిన్న గన్నవరంలో జరిగిన పార్టీ సమావేశంలో ఆయన మాటలాడిన మాటలు నారా లోకేష్‌తో సహా అందరికీ ఇబ్బంది కలిగించాయి.

‘వార్డు మెంబరుగా కూడా గెలవని నారా లోకేష్‌…’ అంటూ వైసీపీ నేతలు పదేపదే ఎద్దేవా చేస్తుండటం గురించి యార్లగడ్డ ప్రస్తావిస్తూ, “మనం ఇంకా ఏ యుగంలో ఉన్నాము? రాజకీయాలలో పైకి ఎదగాలంటే వార్డు మెంబర్ స్థాయి నుంచి ఎదగాలా?అది తప్పనిసరా? నేరుగా ఎమ్మెల్యేగా పోటీ చేయకూడదనే రూల్ ఏమైనా ఉందా?

ADVERTISEMENT

నారా లోకేష్‌ మంగళగిరిలో పోటీ చేసి ఓడిపోయారని వైసీపీ నేతలు విమర్శించి ఉంటే ఇంకా సహేతుకంగా ఉండేది కానీ పదేపదే వార్డు మెంబరుగా కూడా చేయలేదని విమర్శిస్తుండటం చాలా అర్దరహితం. ఇందిరాగాంధీ, ఎన్టీఆర్‌, కేసీఆర్‌ వంటివారెందరో గెలుపోటములు చూశారు.

అలాగే నారా లోకేష్‌ కూడా గత ఎన్నికలలో ఓడిపోయారు. వచ్చే ఎన్నికలలో మంగళగిరి నుంచే భారీ మెజార్టీతో గెలవబోతున్నారు. ఇది తధ్యం. అంతేకాదు… భవిష్యత్‌లో నారా లోకేష్‌ ఏపీకి ముఖ్యమంత్రి కూడా అవుతారు. ఇది తధ్యం,” అని అన్నారు.

యార్లగడ్డ ఈ మాట చెప్పినప్పుడు సమావేశంలో పాల్గొన్నవారందరూ “చంద్రబాబు నాయుడు జిందాబాద్.. సిఎం చంద్రబాబు నాయుడు…” అంటూ నినాదాలు చేశారు. ఇది వేదిక మీద ఉన్న నారా లోకేష్‌తో సహా టిడిపి నేతలకు ఎంత ఇబ్బందిగా ఉంటుందో ఊహించుకోవచ్చు.

నారా లోకేష్‌ యువగళం పాదయాత్ర చేస్తూ ప్రజలకు హామీలు ఇస్తూ ముందుకు సాగుతుండటం చూసి, టిడిపిలో చిచ్చు పెట్టేందుకు ‘టిడిపి ముఖ్యమంత్రి అభ్యర్ధి నారా లోకేష్‌’ అంటూ వైసీపీ నేతలు దుష్ప్రచారం ప్రారంభించారు.

దీంతో పార్టీ నేతలలో, కార్యకర్తలలో, ప్రజలలో కూడా గందరగోళం ఏర్పడితే టిడిపి నష్టపోతుందని గ్రహించిన నారా లోకేష్‌, ‘చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రిగా ఉంటారని’ ప్రతీచోట గట్టిగా నొక్కి చెపుతూ వైసీపీ కుట్రకు చెక్ పెట్టారు. అలాగే టిడిపి శ్రేణులలో అయోమయాన్ని తొలగించారు కూడా.

అయితే పార్టీలో కొత్తగా చేరిన యార్లగడ్డ వెంకటరావు అత్యుత్సాహంతో నారా లోకేష్‌ ముఖ్యమంత్రి అవుతారని మాట్లాడటం వలన పార్టీకి ఇబ్బంది కలిగించిన్నట్లే అయ్యింది. టిడిపిలో చాలా మంది సీనియర్ నాయకులు ఉన్నారు. వారందరూ ఈ మాట చెప్పలేక కాదు. కానీ సమయం సందర్భం లేకుండా ఎప్పుడో భవిష్యత్‌లో జరుగబోయే దాని గురించి ఇప్పుడే మాట్లాడటం వలన పార్టీలో అయోమయం, పార్టీకి నష్టం కలుగుతుందనే అందరూ చంద్రబాబు నాయుడు నాయకత్వంలో పనిచేస్తున్నారు.

బహుశః వారు ఈ విషయం సమావేశం ముగిసిన తర్వాత యార్లగడ్డకు చెప్పే ఉంటారు. కనుక ఇకపై ఆయన తన ఈ దూకుడు అంతా గన్నవరంలో వల్లభనేని వంశీతో యుద్ధం చేసేందుకు ఉపయోగిస్తే అందరికీ మంచిది.

ADVERTISEMENT
Latest Stories