కోనసీమ జిల్లాలోని రామచంద్రాపురం టికెట్ కోసం ఎంపీ పిల్లి శుభాష్ చంద్రబోస్, మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్ కృష్ణల మద్య పంచాయితీ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈలోగా గన్నవరంలో కూడా మళ్ళీ పంచాయితీ మొదలైంది.
వైసీపీ సీనియర్ నేతలు దుట్టా రామచంద్రరావు, యార్లగడ్డ వెంకటరావు ఇద్దరూ మొదటి నుంచి వల్లభనేని వంశీని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. తాజాగా యార్లగడ్డ వెంకటరావు దుట్టా ఇంటికి వెళ్ళి సుదీర్గంగా చర్చించిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ, “కొన్ని ఇబ్బందుల కారణంగా రెండేళ్ళు ఆజ్ఞావాసంలో ఉండిపోయాను. కనుక నేను గన్నవరం రాజకీయాల నుంచి తప్పుకొన్నట్లు కొందరు పనిగట్టుకొని ప్రచారం చేస్తున్నారు.
నాకు అమెరికాలో వ్యాపారాలు ఉన్నందున అప్పుడప్పుడు అక్కడికి వెళ్ళి వస్తుంటాను. కానీ అంతమాత్రన్న గన్నవరం వదిలే ప్రసక్తే లేదు. వచ్చే ఎన్నికలలో నేను గన్నవరం నుంచే పోటీ చేస్తాను. ఇది 100 శాతం ఖాయం. ఒకవేళ మరెవరికైనా టికెట్ ఇచ్చినా కూడా నేను పోటీ చేయడం ఖాయమే. నేను పోటీ చేస్తున్నప్పుడు పార్టీ క్యాడర్ నాకే మద్దతు ఇస్తుంది కానీ వేరెవరికో కాదు కదా?” అని అన్నారు.
ఒకవేళ టికెట్ లభించకపోతే యార్లగడ్డ వెంకటరావు టిడిపిలో చేరి పోటీ చేయాలని నిర్ణయించుకొన్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కనుక విలేఖరులు అదే ప్రశ్నించినప్పుడు, “రాజకీయాలలో ఉన్నవారు ఇలాంటి ఊహాజనితమైన ప్రశ్నలకు ఏం సమాధానం చెపుతారు?నేనిప్పుడు ఏ పార్టీలో ఉన్నాను?” అంటూ ఎదురు ప్రశ్నిస్తూ సమాధానం చెప్పకుండా దాటవేశారు.
గత ఏడాది జూన్‌లో గన్నవరం నియోజకవర్గం నేతలతో సమీక్షా సమావేశంలో మాజీ మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ, “వచ్చే ఎన్నికలలో గన్నవరం నుంచి వల్లభనేని వంశీయే పోటీ చేస్తారని, ఆయనకే మళ్ళీ టికెట్ ఇస్తానని జగన్ నాతో చెప్పారు. కనుక పార్టీలో ఆశావాహులందరూ ఆయనను గెలిపించుకొనేందుకు కలిసికట్టుగా పనిచేయాలి,” అని అన్నారు.
కానీ యార్లగడ్డ వెంకటరావు గన్నవరం నుంచి తానే పోటీ చేస్తానని చెప్పడమే కాకుండా దుట్టా రామచంద్రరావుతో కలిసి వల్లభనేని వంశీని ఓడిస్తామని కూడా తేల్చిచెప్పేశారు. కనుక గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కూడా మీడియా ముందుకు వచ్చి ఏదో ఒకటి మాట్లాడకుండా ఉండరు. కనుక గన్నవరం పంచాయితీ మళ్ళీ మొదలైన్నట్లే.
గతంలో కూడా ఓసారి ఇలాగే జరిగితే దుట్టా, యార్లగడ్డ వెంకటరావులను సిఎం జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి పిలిపించుకొని అక్షింతలు వేసి పంపారు. కానీ ఈసారి యార్లగడ్డ వెంకటరావు టిడిపిలో చేరాలనుకొంటున్నందున ఆయనకు మళ్ళీ అక్షింతలు అవసరం ఉండకపోవచ్చు వల్లభనేని వంశీని పక్కన పెట్టి ఆయనకు టికెట్ అయినా ఇవ్వాలి లేదా సస్పెన్షన్ వేటు అయినా వేయక తప్పదు. వంశీకే మళ్ళీ టికెట్ అని కొడాలి నాని చెప్పేశారు కనుక ఇక రెండో ఆప్షన్ మాత్రమే ఉంది.



