ఒకే ఒక్క సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా అవతరించిన యష్, భారీ అంచనాలతో మరో నాలుగు రోజుల్లో “కేజీఎఫ్ 2” ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత దేశవ్యాప్తంగా విడుదల కాబోతున్న ఈ సినిమాపై ఉన్న క్రేజ్ అంతాఇంతా కాదు.
సినిమా టాక్ తో నిమిత్తం లేకుండా బాలీవుడ్ ఓపెనింగ్స్ 35 కోట్ల వరకు కొల్లగొట్టే అవకాశముందని ట్రేడ్ పండితులు లెక్కలు చెప్తున్నారంటే, “కేజీఎఫ్ 2” పట్ల ఉన్న క్రేజ్ ఏమిటో అర్ధం చేసుకోవచ్చు. అలాగే రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా టాలీవుడ్ అగ్ర హీరోల సినిమా మాదిరి రిలీజ్ కు నోచుకోవడం విశేషం.
నిజానికి “కేజీఎఫ్” పార్ట్ 1 ధియేటర్లలో చేసిన సందడి కంటే, ఓటీటీలో వచ్చిన తర్వాత సినిమాకు లభించిన ఆదరణే ఎక్కువ. ‘ఇలాంటి సినిమాను ధియేటర్లలో ఎలా మిస్ అయ్యామో’ అనే విధంగా మారిన వైనమే, ఈ సినిమా పార్ట్ 2పై అంచనాలను ఆకాశంలో నిలబెట్టింది.
“కేజీఎఫ్”ను థియేటర్లలో తొలిసారిగా చూసినపుడు క్యారెక్టర్ పేర్లు గానీ, స్క్రీన్ ప్లే గానీ చాలామందికి అర్ధం కాలేదు. అందుకే పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకోలేదు. కానీ ఓటీటీ రిలీజ్ తర్వాత “కేజీఎఫ్” అంటే ఓ మత్తులా మారిపోయింది. దర్శకుడు ప్రశాంత్ నీల్ చూపించిన హీరోయిజానికి ఫిదా కానీ ప్రేక్షకుడు ఉండడు అనిపించే విధంగా తయారయ్యింది.
అందుకే ఈ నెల 14వ తేదీన “కేజీఎఫ్” పార్ట్ 2ను వీక్షించాలనే వారు మరోసారి పార్ట్ 1ను తిలకించే పనిలో ఉన్నారు. మొదటి భాగాన్ని చూసి ధియేటర్ లో అడుగుపెడితే వచ్చే కిక్ వేరే కదా! ఈ సినిమాకు మరో ప్లస్ పాయింట్ సంగీతం. పాటలు గానీ, బ్యాక్ గ్రౌండ్ గానీ అద్భుతం అనిపించే విధంగా రవి అందించిన మ్యూజిక్ మాస్ కి విపరీతమైన కిక్ ను ఇచ్చింది.
పాన్ ఇండియా స్థాయిలో ఇప్పటివరకు “బాహుబలి, ఆర్ఆర్ఆర్” సినిమాలు బ్లాక్ బస్టర్ సక్సెస్ లను సాధించాయి. అయితే అంతకుమించిన క్రేజ్ “కేజీఎఫ్” పట్ల ఉంది. ఈ సారి యష్ చేత దర్శకుడు ప్రశాంత్ నీల్ ఎలాంటి వీరంగం సృష్టిస్తారో తెలుసుకోవాలంటే మరో నాలుగు రోజులు వెయిట్ చేయాల్సిందే.



